ఐటీ గ్రిడ్ సంస్థ దాదాపుగా ఎనిమిది కోట్ల మంది ప్రజల ఆధార్ సమాచారాన్ని అధికారిక సర్వర్ల నుంచి చోరీ చేసిందని.. మూడు రోజులుగా.. తెలంగాణ పోలీసులు అదే పనిగా మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఎక్కడా అధికారికంగా చెప్పడం లేదు. పైగా.. దానికి.. ఆధార్ అధికారులు ఫిర్యాదు చేశారంటూ.. ఓ కలరింగ్ కూడా ఇచ్చారు. అయితే.. ఆధార్ సంస్థ హఠాత్తుగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆధార్ డేటాను తమ సర్వర్ల నుంచి చోరీ చేశారన్నది అబద్దమని… ప్రకటించింది. తెలంగాణ పోలీసులు కూడా.. తమకు డేటా చోరీపై ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. “సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ”, సర్వర్లు పూర్తి సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
తమ అధికారులు పోలీసులకు చేసిన ఫిర్యాదు గురించి కూడా… ఆధార్ సంస్థ ఉడాయ్ వివరణ ఇచ్చింది. పెద్ద ఎత్తున ఆధార్ సమాచారం.. ఐటీ గ్రిడ్ హార్డ్ డిస్కుల్లో ఉందని.. తెలంగాణ పోలీసులు చెబితే… వాటిని సేకరించి, నిల్వచేయడానికి గల కారణాలపై మాత్రమే దర్యాప్తు చేయమని… తమ అధికారులు ఫిర్యాదు చేశారని.. ఉడాయ్ స్పష్టం చేసింది. దీనిపైనా ఉడాయ్ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. సేవలు అందించే సర్వీసు ప్రొవైడర్లే వినియోగదారుల నుంచి నేరుగా ఆధార్ సంఖ్య, ఇతర వివరాలను సేకరించడం తప్పేమీ కాదని స్పష్టం చేసింది. అయితే ఈ సమాచారాన్ని నిర్దేశిత అవసరం కోసమే సర్వీసు ప్రొవైడర్లు ఉపయోగించాలి. వినియోగదారుల అనుమతి లేకుండా ఇతరులతో ఈ వివరాలను పంచుకోకూడదని తెలిపింది.
ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి ఆధార్ సంఖ్యలను సేకరించడం, వాటిని నిల్వచేయడం, వినియోగించడం, ఇతరులతో పంచుకోవడం చేస్తే ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. అందుకే ఆధార్ చట్టంలోని ఏవైనా నిబంధనలను ఉల్లంఘించారా అన్నది కూడా పరిశీలించాలని కోరినట్లు తెలిపింది. ఉడాయ్ అధికారిక ప్రకటనతో… తెలంగాణ పోలీసులు చేసిన హడావుడిపై మళ్లీ అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఓ రాజకీయ ఎజెండాతోనే కేసు పెట్టి… ఐటీ గ్రిడ్ సంస్థను మూసివేయించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న సమయంలో.. ఆ సంస్థపై ఏదో విధంగా కేసును నిలబడేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలకు.. ఉడాయ్ .. స్పందన.. బలం చేకూరుస్తోంది.