ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత.. అంతకు ముందు ప్రభుత్వం కృష్ణమ్మ, గోదావరి నదులకు ప్రతిష్టాత్మకంగా.. నిర్వహిస్తున్న హారతి కార్యక్రమం కూడా రద్దయింది. కారణాలు చెప్పకుండా.. నిర్వాహకులను.. నిలిపివేయమని ఆదేశించడంతో.. ఈ పరిస్థితి తలెత్తింది. గోదావరి వరదల కారణంగా…. రాజమండ్రిలో గోదావరికి హారతికి ఏర్పాటు చేసిన పంటు కూడా కొట్టుకుపోయింది. దాన్ని మళ్లీ యథాస్థితికి తెచ్చే ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. మూడేళ్లుగా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదీ తీరాన గోదావరి-కృష్ణా జలాల పవిత్ర సంగమ ప్రదేశంలో నిత్యహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో రెండు పంట్లు ఏర్పాటు చేసి.. ఆ వేదిక మీద నుంచి కనువిందుగా నిత్య హారతి కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో కనకదుర్గమ్మ దేవస్థానం, డీవీఆర్ ఫౌండేషన్ సంస్థ ఈ నిత్య హారతిని నిర్వహిస్తున్నాయి.
ఓ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా.. పవిత్ర సంగమాన్ని తీర్చిదిద్దడంతో… పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. రోజూ పవిత్ర హారతి చూసేందుకే… పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. వరదల సమయంలో… ప్రభుత్వం నుంచి… హారతులు నిలిపివేయాలన్న ఆదేశాలు వచ్చాయి. అప్పట్నుంచి నిలిచిపోయాయి. హారతులు ఇచ్చే పురోహితులు, పండితుల్ని కూడా విధుల నుంచి తొలగించారు. అప్పటికే ప్రభుత్వం మారినప్పటి నుండి 35 మంది వేదపండితులు, పౌరోహితులకు వేతనాలు కూడా ఇవ్వడం లేదు. ఆ తర్వాత పూర్తిగా తొలగించారు. జీతాలు రాకపోయినా.. కృష్ణమ్మకు కొందరు సొంత ఖర్చులతో.. ఒక పూట హారతి ఇస్తున్నారు. వరదల వల్ల గోదావరిలోనూ నిలిచిపోయిన నిత్యహారతిని పునరుద్ధరించే ప్రయత్నం చేయలేదు.
ప్రభుత్వం తీరుపై హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓ వైపు పాస్టర్లకు జీతాలిచ్చేందుకు హుటాహుటిన నిర్ణయాలు తీసుకుని.. గ్రామవాలంటీర్లతో సర్వే చేయించేస్తున్న సర్కార్… హిందువుల మనోభావాలు దెబ్బతినేలా… నిర్ణయాలు తీసుకుంటూండటం… వివాదాస్పదమవుతోంది. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటికే విమర్శలు ప్రారంభించారు. ఓ కుట్ర ప్రకారమే… ప్రస్తుత ప్రభుత్వం.. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. హారతులు మళ్లీ ప్రారంభిస్తామని… చెప్పుకొస్తున్నారు కానీ… అలాంటి ప్రయత్నాలు మాత్రం.. ప్రభుత్వం ఎక్కడా చేయడం లేదు.