కర్ణాటక బడ్జెట్లో హోంశాఖ గల్లంతయింది. కాంగ్రెస్ తరపున డిప్యూటీ సీఎంగా ఉన్న జి.పరమేశ్వర నిర్వహిస్తున్న శాఖకు కుమారస్వామి.. ఒక్కటంటే..ఒక్క రూపాయి కేటాయించలేదు. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంతే కాదు…కీలకమైన లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షించే శాఖకు నిధుల కేటాయింపు లేకపోతే.. ఎలా అన్న ప్రశ్న సామాన్యులకు కూడా వస్తోంది. కర్ణాటక పోలీసు శాఖలో ఇప్పటికి ఇరవై రెండు వేల ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేసే ప్రక్రియ ఆగిపోయినట్లే. గత ఏడాది సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పోలీస్ స్టేషన్లు, క్వార్టర్స్ లో టాయిలెట్స్ నిర్మాణాలకు పది కోట్లు కేటాయించారు. అవి విడుదల చేయలేదు. కనీసం వాటికి కూడా.. ఈ బడ్జెట్ లోకేటాయింపులు చేయలేదు.
కర్ణాటకలోని జేడీఎస్ – కాంగ్రెస్ సంకీర్ణం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కుమారస్వామి తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు.. రైతులకు రూ. 2లక్షల రుణమాఫీని… ముఖ్యమంత్రి కమ్ ఆర్థిక శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. దీని ద్వారా ప్రభుత్వంపై 34 వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో కుమారస్వామి… శాఖ మధ్య చాలా తేడా చూపించారు. కాంగ్రెస్ మంత్రులు ఉన్న శాఖలకు పరిమితంగానే నిధులు కేటాయించారు. హోంశాఖకు అసలు కేటాయించకపోవడం.. అది కాంగ్రెస్ డిప్యూటీ సీఎం శాఖ కావడంతో.. ముందు ముందు ఇది వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రుణమాఫీ హామీని అమలు చేయడానికే హోంశాఖకు నిధులు కేటాయించలేదన్న సమాధానం జెడీఎస్ క్యాంపు నుంచి వస్తోంది. కానీ ఎంతో కొంత కేటాయించకుండా.. కీలకమైన హోంశాఖను ఎలా నిర్వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీని ప్రకటించిన కుమారస్వామి పన్నులు మాత్రం భారీగా పెంచారు. పెట్రోల్, డీజిల్ పై రూపాయికిపైగా వడ్డించారు. కరెంట్ చార్జీలు కూడా పెంచారు. రైతులకు రుణమాఫీ చేయడానికి తమపై భారం వేయడమేమిటని ఇతర వర్గాలు కూడా గుర్రుగా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే… రుణమాఫీ హామీ తప్ప.. కుమారస్వామి బడ్జెట్ లెక్కల్లో రాజకీయ తెలివి తేటలు మాత్రం చూపించలేకపోయారన్నది కన్నడ నాట వినిపిస్తున్న మాట.. !