తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు ఇప్పుడల్లా ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. కర్ణాటకతో వెంటనే ఒప్పందం చేసుకున్న ఏపీ సర్కార్.. తెలంగాణ విషయంలో మాత్రం… సక్సెస్ కాలేకపోతోంది. బస్సు సర్వీసుల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది సీమాంధ్రులు నిరాశకు గురి కావాల్సి వస్తోంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు ప్రత్యేకమైన ఒప్పందం అవసరం లేదు. పాత ఒప్పందాలు ఉన్నాయి. కానీ.. కరోనా కారణంగా రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర రవాణా ప్రారంభించుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో తప్పనిసరిగా ఏపీ ప్రభుత్వం తెలంగాణతో అవగాహనకు రావాల్సి ఉంది. గతంలో.. హైదరాబాద్ నుంచి ఆంధ్రకు…ఎక్కువగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తిరిగేవి.
ఏపీ ఆర్టీసీ బ స్సులు వంద తిరిగితే..తెలంగాణ ఆర్టీసీ బస్సులు పది కూడా తిరగవు. అందుకే.. కిలోమీటర్ల లెక్కన సమానంగా బస్సులు తిరిగేందుకు ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ పట్టుబడుతోంది. అలా చేస్తే..ఏపీఎస్ఆర్టీసీకి ప్రధానమైన ఆదాయవనరులో కోత పడుతుంది. గతంలోలానే… బస్సులు తిప్పేందుకు ఒప్పందం చేసుకుందామని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. దానికి తెలంగాణ అంగీకరించడం లేదు. ఫలితంగా తొలి సారి జరిగిన చర్చలు ఏమీ తేలకుండానే వాయిదా పడ్డాయి. రెండో సారి బుధవారం చర్చలు జరపాలనుకున్నా.. ఓ అధికారికి కరోనా సోకిందంటూ.. తెలంగాణ చర్చలకు ఆసక్తి చూపించలేదు.
దీంతో హైదరాబాద్ నుంచి ఏపీకి ఇప్పుడల్లా బస్సు సర్వీసులు ఉండటం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే.. గతంలో వస్తున్న ఆదాయంతో పోలిస్తే…30 శాతం కూడా రావడం లేదు. అదే సమయంలో డీజిల్ ధరలు కూడా పెరుగుతూండటంతో… ఆర్టీసీలకు భారంగా మారింది. అంతర్రాష్ట్ర సర్వీసులకు ఆమోదం తెలిపితే..ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడా అవకాశం కూడా తగ్గిపోయింది.