ఓ సినిమా ఫ్లాప్ అయితే దాని ఎఫెక్ట్‌కి ఎంతటి హీరో అయినా సరే, గింగిరాలు తిరగాల్సిందే. ఇందుకు ఎవ్వరూ అతీతులు కారు. ఆఖరికి పవన్ కల్యాణ్ అయినా అంతే! సర్దార్ గబ్బర్ సింగ్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆ ప్రభావం ఇప్పుడు కాటమరాయుడుపై పడింది. సర్దార్ని రూ.60 కోట్లలో తీసిన అదే.. శరత్ మరార్, మరుసటి సినిమాకి బడ్జెట్ సగానికి సగం తగ్గించేశాడు. అన్నింట్లోనూ ‘కోత’లే. దానికి తగ్గట్టుగానే కాటమరాయుడుకి ఆఫర్లు రావడం లేదు. ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. ఉగాదికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఏ ఏరియా రైట్స్ అమ్ముడు కాలేదు. అసలు ఎంక్వైరీలే రావడం లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ కొని నష్టపోయిన బయ్యర్లకు ఈ సినిమాని అమ్మాలన్నది పవన్ నిర్ణయం. అయినా సరే.. కొన్ని ఏరియాల్లో మంచి రేట్లకు ఈ సినిమాని అమ్ముకొనే అవకాశం ఉంది. కానీ… కాటమరాయుడు వైపు బయ్యర్లు ఇప్పటి వరకూ దృష్టి సారించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సర్దార్ కొని పీకల్లోతు అప్పుల్లో ఉన్న బయ్యర్లు ఇప్పుడు కాటమ రాయుడుని కొనే స్థితిలో లేరు. అప్పొ, సొప్పొ చేసి కొంటారనుకొన్నవాళ్లు ఇప్పటి వరకూ చిత్రబృందంతో ఎలాంటి సంప్రదింపులూ జరపడం లేదు. కాటమరాయుడి బజ్ లేకపోవడం, అందరి దృష్టీ…. ఖైదీ నెం.150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలపై పడడంతో.. పవన్ సినిమాని లైట్ తీసుకొన్నట్టు తెలుస్తోంది. పైగా చిత్రసీమ ఇప్పుడు ‘నోట్ల’ సంక్షోభం ఎదుర్కొంటోంది. బ్లాక్ మనీ ఎక్కడకక్కడ ఆగిపోయింది. సినిమాల్ని కొనడానికి డబ్బుల్లేవు. ఉన్నా… విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమైపోతోంది. అందుకే.. బయ్యర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారని అర్థమవుతోంది. అయితే శరత్ మరార్ కూడా ఏమాత్రం టెన్షన్ పడడం లేదు. ఒక్క టీజర్ రిలీజ్ అయితే.. బజ్ అదే వస్తుందన్న ధీమాలో ఉన్నారాయన. మరి ఆ టీజర్ ఎప్పుడొస్తుందో, కాటమరాయుడు టైమ్ ఎప్పుడు మొదలవుతుందో??