గజిని తరవాత సూర్య పాపులారిటీ తెలుగులో అమాంతంగా పెరిగిపోయింది. కథల ఎంపికలో తాను చూపించే వైవిధ్యం, వెరైటీ పాత్రలు… తెలుగు ప్రేక్షకులకు నచ్చేశాయి. దాంతో.. సూర్య సినిమాలకు తెలుగులో మంచి గిరాకీ ఏర్పడింది. సింగం సిరీస్‌లో వచ్చిన సినిమాలు ఇక్కడి మాస్ హీరోల చిత్రాలతో పోటీ పడి మరీ విజయాల్ని అందుకున్నాయి. సూర్య సినిమా అంటే తెలుగులో కనీసం 10 కోట్ల మార్కెట్ ఖాయం. అయితే.. ఇదంతా గతం. ప్రస్తుతం సూర్య సినిమా అనేసరికే తెలుగులో కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దానికి కారణం.. సూర్యని చుట్టిముట్టిన ఫ్లాపులే. ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా ఐదారు సినిమాలు బోల్తా పడ్డాయి. అవి కూడా భారీ ఫ్లాపులు. తాజాగా ఎన్.జీ.కే తో బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. దాంతో సూర్య సినిమా అనేసరికి.. తెలుగులో బయ్యర్లు కరువయ్యారు. ప్రస్తుతం బందోబస్త్ సినిమా పరిస్థితి ఇలానే ఉంది. సూర్య – కె.వి.ఆనంద్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. మోహన్‌లాల్ లాంటి స్టార్ ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించారు. ఈనెల 20న విడుదల కానుంది. ఇప్పటి వరకూ తెలుగులో ఈ సినిమాని అమ్మలేకపోయారు. పాత బయ్యర్లని పిలిచి – మాట్లాడినా ఫలితం లేక పోతోంది. ‘ఈ సినిమాని తక్కువకే ఇస్తాం… డబ్బులొచ్చాకే మాకు మిగిలిన సొమ్ము కట్టండి’ అని ఆఫర్లు ఇస్తున్నా.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదట. ఇక్కడే కాదు.. తమిళంలోనూ పరిస్థితి ఇంచుమించుగా ఇలానే ఉంది. బందోబస్త్ కూడా అటూ ఇటూ అయితే.. సూర్య కెరీర్ మరింత ప్రమాదంలో పడుతుంది. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ…సూర్య భవిష్యత్తేమిటన్నది ఈనెల 20న తేలిపోతుంది.