నెక్ట్స్ ఏంటి? ట్రైలర్లు, పాటలూ.. బాగున్నాయి. పైగా తమన్నా సినిమా. అన్నింటికంటే మించి… బాలీవుడ్ దర్శకుడు చేసిన తెలుగు సినిమా ఇది. అయితే ఏం లాభం..? ఈ సినిమాకి కొంచెం కూడా క్రేజ్ రాలేదు. ట్రైలర్లు, పాటలకు వచ్చిన స్పందన చూసి – ఈ సినిమాకి ఓ రేంజులో మార్కెట్ జరుగుతుందని నిర్మాతలు ఆశ పడ్డారు. కానీ.. కనీసం ఈ సినిమాకి ఎంక్వైరీలు కూడా రావడం లేదని తెలిసింది. దానంతటికీ కారణం.. సందీప్ కిషన్ ట్రాక్ రికార్డు. ఈమధ్య సందీప్ టైమేమీ బాలేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. గత రెండేళ్లుగా సందీప్ ఖాతాలో ఒక్కటంటే ఒక్క యావరేజ్ సినిమా కూడా లేదాయె. పోస్టరుపై సందీప్ బొమ్మ చూసి.. ఈ సినిమాని కొనడానికి భయపడుతున్నారంతా.
నిజానికి `ఇది తమన్నా సినిమా` అని మార్కెట్ చేసుకోవాలన్నది నిర్మాతల ఆలోచన. తమన్నా పెట్టిన కండీషన్ అదే. `నా సోలో సినిమా అన్నట్టు ప్రచారం చేయండి` అని తమన్నా చెప్పింది కూడా. కానీ.. సందీప్ కిషన్, నవదీప్‌లను తీసుకొచ్చి… దీన్నో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే యాంగిల్ ఇచ్చారు. నిర్మాతలు కూడా ఏం చేయలేని పరిస్థితి. తెరపై తన బొమ్మ కనిపించకపోతే సందీప్ సీరియెస్ అవుతాడు. అందుకే ఏం చేయాలో తెలీక.. పోస్టర్లను, ట్రైలర్లను ఇలా జంటగా డిజైన్ చేశారు. ఎంత తమన్నా ఉన్నా… ఇది సందీప్ కిషన్ సినిమాగానే చలామణీ అవుతుండడంతో ఈ సినిమా బిజినెస్‌పై అది ప్రభావం చూపిస్తోంది. అసలు సందీప్ కిషన్‌ని తీసుకోవడం తమన్నాకి ఇష్టం లేదని, ఇప్పుడు అదే సంగతి గుర్తు చేసి.. నిర్మాతల్ని తమన్నా వేలెత్తి చూపిస్తోందని, తమన్నా హర్టయితే.. ప్రమోషన్లకు ఎక్కడ రాదో అన్నభయంతో నిర్మాతలు కూడా సర్దుకుపోతున్నారని సమాచారం. అదే గనుక… సందీప్ ప్లేసులో మరో హీరో ఉంటే, దీన్ని తమన్నా సినిమాగా ప్రమోట్ చేసి ఉంటే… ఈ పాటికే నిర్మాతలు నాలుగు డబ్బులు చూసేవారేమో.