సోమవారానికి ఆదివారానికి ఎంత తేడా..? ఆదివారానికి సోమవరారానికి ఎంత తేడా..? . ఈ తేడాను ఉపయోగించుకున్నవారికే బాగా తెలుస్తుంది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మాస్టర్ ప్లాన్. ఎంపీల ఉపఎన్నికలు రాకుండా.. ఎలాంటి స్కెచ్ వేసిందో సాక్షాత్తూ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ స్పష్టంగా ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ.. ఆయన ఏపీలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని తేల్చారు. అరకు అసెంబ్లీ స్థానానికి కూడా ఉపఎన్నికలు రావన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామాచేసిన ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరపడం లేదని ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది.
2019 జూన్ 4వ తేదీతో లోక్సభ పదవీకాలం గడువు ముగుస్తుంది. ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన నియోజకవర్గాలకు కనీసం ఏడాది పాటు అయినా ప్రజాప్రతినిధులు పదవిలో ఉండాలి. ఏడాదిలోపు పదవీ కాలం ఉన్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు వీల్లేదని ఎన్నికల చట్టంలో స్పష్టంగా ఉందని ఈసీ చెబుతోంది. ఈ ఏడాది జూన్ 3వ తేదీన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలు ఆమోదించారు. అప్పటి నుంచి లెక్క చూస్తే వచ్చే ఏడాది జూన్ 4వ తేదీకి లోక్సభ పదవీకాలం గడువు ముగుస్తుంది. అంటే ఏడాది సమయం లేదనేది .. ఈసీ వాదన. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తేల్చేశారు. జూన్ 3, జూన్ 4 లెక్కలను చూసుకుని రాజీనామాలు ఆమోదింప చేసుకున్నారు.
నిజానికి అధికారికంగా స్పీకర్ జూన్ 21వ తేదీన వైసీపీ రాజీనామాలను ఆమోదించారు. ఈసీకి జూన్ 3వ తేదీన ఆమోదించినట్లు సమాచరం అందిందేమో…! ఎలా చూసినా ఉపఎన్నికలను తప్పించుకుంది వైసీపీ. వైసీపీ ఎంపీలు మొదటి నుంచి ఉపఎన్నికలు రాకుండా రాజీనామాలు చేశారని.. ఉపఎన్నికలు ఆమోదించుకున్నారన్న ప్రచారం జరిగింది. అదే నిజమని.. ఈసీ ప్రకటనతో స్పష్టమయింది. ఈ విషయంపై ముందు నుంచి క్లారిటీ ఉందేమో కానీ.. ఈసీ కూడా.. ఎలాంటి కసరత్తు చేయలేదు. ఇప్పుడు తీరిగ్గా విలేకరుల సందేహాన్ని మాత్రం తీర్చింది.