ఏపీలో మంత్రివర్గ మార్పుచేర్పులపై చర్చ జరుగుతోంది. నిజానికి తెలంగాణలో కూడా ఎప్పట్నుంచే మంత్రివర్గంలో మార్పులపై ప్రచారాలు జరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేటప్పుడు పూర్తిగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమీకరణాలనే చూసుకున్నారన్న ప్రచారం జరిగింది. కేసీఆర్ కూడా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. కానీ మార్పుచేర్పులు చేస్తే ఏమవుతుందో అన్న ఉద్దేశంతో.. సరైన సమయం రాలేదని ఆగిపోతున్నారు.
సంక్రాంతి అయిపోగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అన్నారు. ఇప్పుడు ఉగాది కూడా వస్తోంది. కానీ అలాంటి ఆలోచన ఉన్నట్లుగా స్పష్టత లేదు. ఆగస్టు తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారన్న ఉహాగానాలు వస్తున్నాయి. అదే నిజమైతే కేసీఆర్.. ఇక మంత్రి వర్గాన్ని విస్తరించకపోవచ్చని భావిస్తున్నారు. కానీ పరిస్థితులు బాగో లేవనుకుంటే కేసీఆర్ ముందస్తుకు వెళ్లరని.. అదే జరిగితే.. మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాజకీయ వ్యూహ ధురంధురిడిగా పేరొందిన కేసీఆర్ ఇటీవల ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నారు. ఆయన వ్యూహాలపై ఆయనకు నమ్మకం సన్నగిల్లుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన ప్రశాంత్ కిషోర్ టీం సేవలు తీసుకుంటున్నారు . పీకే టీంలు సర్వేలు చేసి.. మంత్రుల్ని మార్చాలని నివేదిక ఇస్తే అప్పుడు వెంటనే కేబినెట్‌ను మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.