రాబోయే 30 రోజుల్లో పంచాయతీల రూపురేఖలు మార్చేద్దామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కోసం ఏర్పాటు చేసిన సమావేశం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికారులు, మంత్రులు సహజంగానే ఈ కార్యక్రమంలో ఉండాలి. కానీ, నిన్న జరిగిన సమావేశంలో ముగ్గురు కీలక మంత్రులు కనిపించలేదు. వారిలో ఇద్దరు మంత్రులు ఈ సమావేశానికి రాకపోవడానికి వేర్వేరు కారణాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ, మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్ లో ఉండి కూడా ఈ యాక్షన్ ప్లాన్ ప్రకటనలో ఎందుకు కనిపించలేదన్నది ప్రశ్న..?
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లారు, కాబట్టి ఆయన ఈ సమావేశానికి రాలేకపోయారు. మరోమంత్రి జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటలో పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లాల్సి వచ్చింది, కాబట్టి ఆయనా హాజరు కాలేదు. ఇద్దరూ నగరంలో లేరు కాబట్టి రాలేదు! ఇక, మరో మంత్రి ఈటెల రాజేందర్… హైదరాబాద్ లోనే ఉన్నారు, కానీ సీఎం నిర్వహించిన సమీక్షకు హజరు కాలేదు. రోజంతా ఏం చేశారంటే… ఉదయం 11కే ఫీవర్ హాస్పిటల్ కి వెళ్లారు, ఆ తరువాత కోటీ వైద్య విధాన పరిషత్ కి వెళ్లారు. అక్కడి నుంచీ సీఎం సమీక్ష సమావేశానికే ఆయన వెళ్తారని అనుకున్నారు.. కానీ, ఆయన రాలేదు! ఇంతకీ, ఆయన్ని పిలిచారా అంటే.. సీఎం పేషీ నుంచి ఎలాంటి ఫోన్లు ఆయనకి రాలేదని అంటున్నారు. ఫోన్ వస్తే బయల్దేరదామనే ఉద్దేశంతోనే చేతిలో మొబైల్ పట్టుకుని సాయంత్రం వరకూ ఈటెల ఎదురుచూశారంటూ ఆయన అనుచరులు అంటున్నారు. సాధారణంగా, ఇలాంటి కీలక సమావేశాలుంటే సీఎం కార్యాలయం నుంచి అధికారులు, మంత్రులకు ఫోన్లు వెళ్తాయి. కానీ, ఈటెలకి ఎలాంటి ఫోన్లూ రాలేదట!
ఇంకో విషయం ఏంటంటే… 30 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటన కార్యక్రమానికి ఏ మంత్రికీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రావాలంటూ ఫోన్లు వెళ్లలేదట! కానీ, అధికారులతోపాటు మంత్రుల్ని కూడా పిలుస్తామంటూ సీఎంవో నోట్ లో ఉందట! అలాంటప్పుడు సీఎం కార్యాలయం పిలవాలి కదా అంటే… ఏమో, ప్రగతి భవన్ నుంచి మంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయేమో అంటూ సీఎం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిజానికి, ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు మంత్రుల్ని, అధికారుల్నీ పిలవాల్సిన బాధ్యత సీఎంవోదే కదా. సరే, ఈ సమన్వయ లోపం సంగతి పక్కనబెడితే… మంత్రి ఈటెల రాజేందర్ నగరంలో అందుబాటు ఉండి కూడా ముఖ్యమంత్రి నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లకపోవడం కొంత చర్చనీయంగానే మారింది.