అంచనాలకు ఎక్కువ వేసుకుని అత్యాశకు పోతే చివరికి సొంత వాళ్లు కూడా మిగలని పరిస్థితి సాగర్‌లో బీజేపీకి ఎదురయింది. టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేశాక ఆ పార్టీ నుంచి నేతలు పెద్ద ఎత్తున బీజేపీలోకి వస్తారని… వారిలో బలమైన వ్యక్తిని చూసి టిక్కెట్ ఇవ్వాలని బీజేపీ పెద్దలు అనుకున్నారు. కానీ ఎవరూ రాలేదు. చివరికి కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రవికుమార్ నాయక్ అనే కాంగ్రెస్ నేత.. అదీ కూడా జానారెడ్డి అనుచరునిగా ఉన్న వ్యక్తికి టిక్కెట్ ఇచ్చింది. దీంతో సాగర్ బీజేపీలో అంతో ఇంతో పని చేసుకుంటూ వచ్చిన బీజేపీ నేతలందరూ.. కారెక్కడం ప్రారంభించారు. ఇప్పటికే టిక్కెట్ రేసులో చివరి వరకూ పోరాడిన కడారి అంజయ్య యాదవ్ ఇక బీజేపీని నమ్ముకోవడం ఇష్టం లేక.. అనుచరులతో కలిసి ఫామ్‌హౌస్‌కు పోయి గులాబీ కండువా కప్పేసుకున్నారు.
ఇక సాగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదితా రెడ్డి అనే నేత… బీజేపీ జిల్లా అధ్యక్షుడి భార్య. ఈమె తనకే టిక్కెట్ వస్తుందని నామినేషన్ కూడా వేశారు. ఇక బీజేపీని నమ్ముకుని ప్రయోజనం లేదనుకుని టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కనీసం ఆర్థిక ప్రయోజనాలు అయినా దక్కుతాయని ఈ దంపతులు ఆశతో ఉన్నారు. వారికి టీఆర్ఎస్ నేతలు మంచి ఆఫర్లు ఇచ్చారు. డీల్ కూడా సెటిలైందని… ఆమె నామినేషన్ ఉపసంహరించుకుని టీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తుందని సాగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అసలు క్యాడరే లేని బీజేపీకి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చి పోటీకి టిక్కెట్ దక్కించుకున్న నేత రవికుమార్ ఒక్కరే మిగిలారు.
గత ఎన్నికల్లో సాగర్‌లో బీజేపీకి రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి ఎవరైనా బలమైన అభ్యర్థి ఇతర పార్టీల నుంచి వస్తే… పోటీకి దింపాలని చివరి వరకూ భావించారు. జానారెడ్డి నుంచి … కోటిరెడ్డి వరకూ చాలా మందిపై మైండ్ గేమ్ నడిపారు. కానీ ఎవరూ బీజేపీ వైపు చూడలేదు. ఇప్పుడు..గత ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు అయినా వస్తాయా అన్నది సందేహం. అలా రాకపోతే… బీజేపీ గాలి బుడగ పేలిపోయినట్లవుతుంది. అదే బీజేపీ నేతలను టెన్షన్‌కు గురి చేస్తోంది.