గత ఎన్నికల్లో పదికి పది సీట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గెల్చిన వైసీపీ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు దొరకనంతగా దిగజారిపోయింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలపై పార్టీ మార్పు ప్రచారాలు జరుగుతున్నాయి. మరో వైపు అలాంటి ప్రచారాలు రాని వారు అవినీతి ఆరోపణల్లో నిండా మునిగిపోయారు. కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తిరుగుబాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసలు వారు పోతే వారికే నష్టం అన్నట్లుగా వారిద్దర్ని అవమానించేసి వెంటనే ఇంచార్జుల్ని కూడా పెట్టేసిన సీఎం జగన్‌కు తర్వాత అసలు ఉక్కపోత ప్రారంభమయింది.
నెల్లూరు రూరల్‌లో అనిల్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆయనకు టిక్కెట్ ఇవ్వరని ప్రచారం జరుగుతోంది. అయితే అనిల్ మాత్రం వీర విధేయత ప్రదర్శించి టిక్కెట్ పొందాలనుకుంటున్నారు. ఆయనకు కాకపోతే ఇంకెవరికి టిక్కెట్ అంటే ఒక్క బలమైన నేత కనిపించడం లేదు. డబ్బున్న నేతను తెచ్చి పెట్టాలి. కానీ అనిల్ మాత్రం… పార్టీ మారిపోయిన వారిని తిట్టి జగన్ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడ వైసీపీ పరిస్థితి తలకిందులయిందని సర్వేలు చెబుతున్నాయి.. నెల్లూరు రూరల్‌కు అదాలను అభ్యర్థిగా ప్రకటించేశారు. కానీ ఆయన మాత్రం వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అసలు ఆయన పార్టీలో ఉంటారా లేదా అన్న చర్చలు కూడా ప్రారంభమయ్యాయి.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. ఆయన కుటుంబానికి టిక్కెట్ ఇస్తారని చెబుతున్నారు. కానీ అసలు మేకపాటి ఫ్యామిలీనే పార్టీ మారుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇక కోవూరు ఎమ్మెల్యే చంద్రబాబును కలిసినట్లుగా తెలియడంతో ఆయనను నమ్ముకోవడానికి వైసీపీ కూడా రెడీగా లేదు. కావలి ఎమ్మెల్యే పై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలా వరుసగా నెల్లూరు అస్తవ్యస్థం కావడం వైసీపీ నాయకుల్ని కూడా విస్మయ పరుస్తోంది. దీనంతటికి కారణం … సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా హైకమాండ్ మా వర్గం.. ఇతర వర్గం అని విభజించుకోవడమే కారణమని విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి.