ఫైబర్ నెట్ డబ్బులు అప్పనంగా ఆర్జీవీ కొట్టేశారని ఫ్రూఫ్స్ తో సహా నోటీసులు ఇచ్చారు. పదిహేను రోజుల్లో తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చి నాలుగు పదిహేను రోజుల్లో వెళ్లిపోతున్నాయి కానీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తన వద్ద డబ్బుల్లేవని ఆర్జీవీ వెటకారంగా సమాధానం పంపారు. వెంటనే కేసులు పెట్టి .. దొంగతనం అభియోగాలు మోపి.. ఈ వ్యవహారంలో ఉన్న వారినందర్నీ అరెస్టు చేయాల్సిన ఉంది. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అంతే కాదు ఫైబర్ నెట్ లో అడ్డగోలుగా జీతాలు తీసుకుంటూ ఏ పనీ చేయకుండా ఉన్న నాలుగు వందల మందికిపైగా ఉద్యోగుల్ని తొలగించినా వారికి మూడు నెలలుగా జీతాలు చేస్తున్నారట. ఇంత కంటే ఘోరం ఏముంటుంది?. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ఇదే విషయాన్ని మీడియా ముందు ప్రకటించారు. ఐఏఎస్ అధికారి.. ఫైబర్ నెట్ బాధ్యతలు చేస్తున్న దినేష్ వ్యవహారశైలి వైసీపీని కాపాడేలా ఉందని ఆయన ఆరోపణ. అయితే ఇలాంటి అధికారుల విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటుందన్నది ఎవరికీ అర్థం కాని విషయం.
ఫైబర్ నెట్ ను అడ్డగోలుగా దోపిడీ చేశారు. ఆ డబ్బులతో చేయని రాజకీయం లేదు. కొన్ని వందల కోట్లు అప్పులు చేశారు. అన్నీ వైసీపీ నేతలకు పప్పుబెల్లాల్లా పంచి పెట్టారు. ఆ డడబ్బుల కారణంగా టీడీపీ నేతలపై ఇష్టారీతిన మాట్లాడారు. అనేక మాటలు పడ్డారు. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకోకపోతే.. ఇక వారికి చట్టాలపై భయం ఏమి ఉంటుంది. ఎందుకు అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదో కానీ.. జీవీరెడ్డి చెప్పిన వాటిల్లో నిజాలు ఉంటే.. మాత్రం సదరు ఐఏఎస్ ను బాధ్యుడ్ని చేసి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.