ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల్లో కుల,మత భావనలు తొలగించే లక్ష్యంతో స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్లో అనూహ్యమైన మార్పు తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్లో.. కుల, మత వివరాలు నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే వాటిని తొలగించాలని.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు. సాధారణంగా స్కూల్ రికార్డులలో మాత్రమే విద్యార్థులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. స్కూల్ అటెండన్స్ రిజిస్టర్లో ఉండవు. అయితే కొన్ని స్కూళ్లలో అటెండన్స్ రిజిస్టర్లోనే ఆ వివరాలు నమోదు చేస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.
దీంతో అలాంటి వివరాలేమీ… ఇక అటెండెన్స్ రిజిస్టర్లో ఉండకూడదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అటెండెన్స్ రిజిస్టర్లోనే ఉండటం వల్ల.. విద్యార్థి దశలోనే వారిలో కుల మత భావనలు పెరిగిపోతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మాములుగా అయితే.. విద్యార్థులను జాయిన్ చేసుకునేటప్పుడు కులాలవివరాలు కూడా తీసుకోలేరు. ఓసీ, బీసీ , ఎస్సీ,ఎస్టీలాంటి వివరాలు మాత్రమే తీసుకుంటారు. కానీ కొన్ని స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులు అమితమైన ఉత్సాహంతో… కులాల వివరాలు తెలుసుకుంటున్నారు.
ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి ఇవికీలకంగా ఉంటున్నాయి. ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తోంది. అమ్మఒడితోపాటు ఇతర పథకాల కింద విద్యార్థులకు ఇచ్చే సాయాన్ని కార్పొరేషన్ల ఖాతాలో వేస్తోంది. ఈ లెక్కల కోసం అయినా విద్యార్థుల కులాల వివరాలు మొత్తం సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వాటిని అటెండెన్స్ రిజిస్టర్లో మాత్రం పెట్టకూడదని తాజా ఆదేశాలు ఇచ్చారు.