వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కానీ… కోడి కత్తి కేసు కానీ.. సీబీఐకి అప్పగించే ఉద్దేశమే లేదని… వైసీపీ స్పష్టం చేసింది. ఈ మేరకు విజయసాయిరెడ్డి తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ… సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీడీపీ హయాంలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నందున… అప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని.. ఇప్పుడు పోలీసులు నీతిమంతులయ్యారని… సిన్సియర్ గా పనిచేస్తున్నారని… ఆయన చెప్పుకొచ్చారు. అంటే.. తాము డిమాండ్ చేసిన కేసుల్లోనూ… విచారణ రాష్ట్ర పోలీసులతోనే.. అదీ కూడా.. స్వయంగా సీఎం జగన్ పై .. జరిగిన హత్యాయత్నం.. అలాగే సీఎం జగన్ బాబాయ్ హత్యకేసులనూ.. ఏపీ పోలీసులే విచారిస్తారని.. సీబీఐ దాకా పోవడం లేదని… విజయసాయిరెడ్డి నేరుగా అంగీకరించినట్లయింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో… ఎలాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చి.. ప్రతిపక్షాల నుంచి సీబీఐ విచారణకు డిమాండ్ వచ్చిన మరుక్షణం… సీఎం హోదాలో వైఎస్.. ఏ మాత్రం ఆలోచించేవారు కాదు. తక్షణం సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వం తరపున కేంద్రానికి లేఖ వెళ్లిపోయేది. అది… ఫోక్స్ వ్యాగన్ కేసు కావొచ్చు.. పరిటాల రవి హత్య కేసు కావొచ్చు… ఏదైనా సరే… స్వయంగా.. వైఎస్ జగన్ పై ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఆయన లెక్కచేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం.. తాము స్వయంగా డిమాండ్ చేసిన కేసుల్లోనూ… అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. సీబీఐ విచారణకు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఆ విషయం విజయసాయిరెడ్డి ప్రకటనలతో స్పష్టమయింది.
కేంద్రంతో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నెంబర్ -2 విజయసాయిరెడ్డి పరోక్షంగా అంగీకరించినట్లయింది. వైఎస్ వివేకా కేసు కానీ.. కోడి కత్తి కేసు కానీ.. సీబీఐకి ఇస్తూ.. సిఫార్సు చేస్తే తమ జుట్టు మరోసారి కేంద్రం చేతికి ఇచ్చినట్లవుతుందన్న ఆందోళన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో నిజమైన నిందితుల్ని పట్టుకోవాలంటే… గంటల్లో పని అని… పోలీసు శాఖలో సాధారణ కానిస్టేబుల్ కూడా అంచనా వేయగలిగిన విషయం. అయినా… ఎందుకు సాగదీస్తున్నారో… కొంత మందికే తెలుసు. కోడికత్తి కేసు విషయంలోనూ అదే పరిస్థితి. మొత్తానికి… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. సీబీఐ విచారణ కోసం కోర్టులకు సైతం వెళ్లిన వైసీపీ.. ఇప్పుడు.. అధికారంలోకి వచ్చాక అవే కేసులను…సీబీఐకి అప్పగించడంలో మాత్రం… వెనుకగుడు వేస్తోందని స్పష్టమవుతోంది.