బిజెపి కురువృద్ధుడు ఎల్కె అద్వానీ తదితరులకు బాబరీ మసీదు విధ్వంసం కేసు నుంచి విముక్తి కలిగించడం సరి కాదనే పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించడం ఆసక్తికరం. ఈ కేసు వేసిన వారిలో ఒక ముస్లిం న్యాయవాదితో పాటు సిబిఐ కూడా వుంది. నిజానికి సిబిఐదే ప్రధాన పాత్ర. అది పూర్తిగా హౌంశాఖ పరిదిలో పనిచేస్తుందని అందరికీ తెలుసు. అలాటి సంస్థ చూచీ చూడనట్టు వదిలేయడం గాక పనిగట్టుకుని సుప్రీం కోర్టులోవాదన చేసిందంటే మోడీ ప్రభుత్వం పాత్ర స్పష్టమవుతుంది. ఆయనకు అద్వానీ పొడగిట్టదు. 2017జూన్లో రాష్ట్రపతి ఎన్నిక వచ్చేసరికి అద్వానీ రంగంలో వుంటే ఆయన పేరే ముందుకు వస్తుంది. బాబరీ కేసుతో సహా చాలా వివాదాలలో వున్న అద్వానీని సహజంగానే కాంగ్రెస్ వామపక్షాలు బలపర్చవు.అలాటప్పుడు ఆయనకు అసలు అవకాశం లేకుండా చేస్తే ఉభయ తారకం అన్న ఆలోచన నుంచే ఈ కేసు పైకి వచ్చింది. నిజానికి ఆయనను గతంలో వదిలేయడమే అన్యాయం. ఎందుకంటే ఆ మొత్తానికి ఆయనే నాయకుడు. ఇప్పటికైనా సమగ్రంగా విచారణ జరిపి దోషులెవరో శిక్షిస్తే దేశ ప్రజలు సంతోషిస్తారు.ఇక ఇప్పటి వరకూ రాష్ట్రపతి ఎంపిక విషయంలో గుంభనగా వున్న అద్వానీ ఇప్పుడు కూడా పెద్ద హడావుడి చేయకుండా వుండిపోవలసిందే. ఏమైనా అంటే ఈ కేసుఉత్తర్వే పెద్ద ఆటంకమవుతుంది. జయలలిత కేసులోనూ హైకోర్టు ఆదేశాలను రద్దు చేసి అరెస్టు చేయాలన్న కింది కోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు ధృవీకరించింది. మరి ఈ విషయంలోనూ అదే జరిగే అవకాశం చాలా వుంటుంది. 22న తేల్చేస్తామంటున్నారు గాని అంత త్వరగా పూర్తవుతుందా అన్నది చూడాలి. ఏమైనా సరే దీన్ని సాకుగా చూపి అద్వానీని అధికారికంగా వెనక్కు పంపించడం ఖాయం.