90 శాతం పంచాయతీల్ని వైసీపీ మద్దతుదారులతో ఏకగ్రీవాలు చేసుకోవాలని ఆవేశ పడ్డ వైసీపీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ బ్రేక్ వేశారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఉపసంహరణల తర్వాత ఇరవై శాతం కన్నా తక్కువగానే ఏకగ్రీవాలు తేలాయి. ఇందులో వైసీపీకే అత్యధికం వచ్చినప్పటికీ… టీడీపీతో పాటు స్వతంత్రులు కూడా కొన్ని గెల్చుకున్నారు. వీటిలో కూడా ఎక్కువగా గ్రామాల్లో పెద్దలంతా కూర్చుని అధికార పార్టీగా ఉన్న వారికి సర్పంచ్ పదవి వస్తే నిధులొస్తాయని తీర్మానించుకుని ఉపసర్పంచ్ పదవులు ఇతర పార్టీల వారికి కట్టబెట్టారు. వార్డు పదువులు కూడా అలాగే పంచుకున్నారు. బెదిరింపులకు ఏకగ్రీవమైన పంచాయతీలు చాలా తక్కువ. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ ఏకగ్రీవాలు జరిగాయి. దీంతో అక్కడ ఏకగ్రీవాల ప్రకటన నిలిపివేయాలని నిమ్మగడ్డ ఆదేశించారు. వాటిపై నివేదిక అడిగారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో పంచాయతీ ఎన్నికలు జరిగకూడదని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. చివరికి సుప్రీం వరకూ వెళ్ళింది.. చివరికి సుప్రీం అక్షింతలు వేయడంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది.. దీనితో మరో అంకానికి వైసీపీ తెరతీసింది.. ఏకగీవ్రాలు చేసుకోవాలంటూ భారీ ఎత్తున ప్రచారం చేసింది.. తాయిలాలు కూడా ప్రకటించింది. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో ఏక గ్రీవాల కోసం బెదిరింపులకు దిగింది.. అటు ప్రభుత్వ పెద్దలు కూడా బెదిరించే ధోరణిలోనే ఏకగ్రీవాల ఫార్మాలాను తెరమీద బలంగా వినిపించారు. వైసీపీని కాదని గెలిస్తే కేసులు.. అనర్హతా వేటే అనే హెచ్చరికలు క్షేత్ర స్థాయికి పంపారు. కానీ పెద్దగా భయపడిన దాఖలాలు లేవు.
ఎస్ఈసీ బలవంతపు ఏకగ్రీవాలపై దృష్టి పెట్టింది.. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమంటూ అదే స్థాయిలో బదులిచ్చింది.. ఇదే సమయలో యాప్ను తీసుకొచ్చింది. అంతేకాదు ఆయా జిల్లల్లో ఎస్ఈసీ పర్యటించారు. మొత్తంగా చూస్తే ఈసారి ఏకగ్రీవాలు ఎలా చూసినా 20 శాతంలోపే ఉంటాయని అంచనా వేస్తున్నారు. వైసీపీ పెద్దలు మొదటి నుంచీ 90 శాతం తమవే ఏకగ్రీవాలని చెప్పుకొచ్చారు. కానీ నిమ్మగడ్డ వారి ఆశల్ని అడియాశలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడారని విపక్ష నేతలంటున్నారు.