అయిదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి రామ్నాత్ కోవింద్ చాలా కాలంగా వూహాగానాలకు కారణమవుతున్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ను అంటుకోకుండా వదిలేశారు. ఇప్పటికి అయిదేళ్లుగా కొనసాగుతూ పదవీ కాలం పూర్తి చేసుకున్న నరసింహన్ స్థానే ఎప్పుడయినా మరొకరిని నియమించవచ్చుననే వాతావరణం చాలా కాలంగా కొనసాగుతున్నది. ఆయన కూడా వీడ్కోలు తరహాలో చాలాసార్లు మాట్లాడారు. అయితే తాజా నియామకాలలో ఇది జరగలేదంటే వెంటనే మరో విడత ప్రకటన ఏదయినా వుంటుందా లేక అరుదయిన పొడగింపు లభిస్తుందా అని రాజకీయ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. మోడీ ప్రభుత్వానికి నరసింహన్కు వున్న అనుబంధం కారణంగానే ఇలా జరుగుతున్నదనే అభిప్రాయమూ వుంది. అయితే ఎంతో కాలం ఇలాగే సాగదీయడం సాధ్యం కాకపోవచ్చు. తమిళనాడులో రాజకీయ కల్లోలాల దృష్ట్యా పూర్తిస్తాయి నియామకం చేయడం, స్వయానా కోవింద్ ఖాళీ చేసిన బీహార్ గవర్నర్స్థానాన్ని భర్తీ చేయడం ప్రాధాన్యతగా భావించి వుండొచ్చు. ఉప రాష్ట్రపతి కాబోతూ కూడా పాత ధోరణి మార్చుకోలేక టిటిడిపి నేత మోత్కుపల్లి నరసింహులుకు గవర్నర్ గిరీ రాబోతుందని వెంకయ్య నాయుడు ఇచ్చిన సంకేతం కూడా ఈ దశలో నిజం కాలేదు.