ఈ యేడాది విడుదల కానున్న క్రేజీ సినిమాల్లో ‘పుష్ష 2’ ఒకటి. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ష’ ఊహించని విజయాన్ని అందుకోవడమే కాకుండా, అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చింది. దాంతో… ‘పుష్ష 2’పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. 2023లోనే ఈ సినిమా విడుదల కావాలి. కానీ… స్క్రిప్టు విషయంలో రాజీ పడకపోవడంతో 2024 ఆగస్టు 15కి వెళ్లింది. అయితే ఆగస్టు 15న కూడా ఈ సినిమా విడుదల కావడం కష్టమని, వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఈమధ్య వార్తలు వినిపించాయి. వాటిపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది. ఆగస్టు 15నే వస్తామని మరోసారి స్పష్టం చేసింది.
‘మరో 200 రోజుల్లో పుష్షగాడి రూల్ మొదలు.. ‘అంటూ ఓ పోస్టర్ ని ఈరోజు విడుదల చేసింది. ఆగస్టు 15కి మరో 200 రోజులే ఉన్నాయి. సో.. చెప్పిన సమయానికి పుష్ష 2 రావడం పక్కా అయ్యిందన్నమాట. ఇటీవల హైదరాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే పాటలన్నీ ఇచ్చేసినట్టు సమాచారం. టీ సిరీస్ ఆడియో రైట్స్‌ని దాదాపుగా రూ.60 కోట్లకు సొంతం చేసుకొందని టాక్. తెలుగు సినీ చరిత్రలో, ఓ సినిమాకి ఈ స్థాయిలో ఆడియో రైట్స్ దక్కడం ఓ రికార్డ్.