తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరిస్థితులు ఏ మాత్రం అర్థం కావడం లేదు. ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలపై పోరాడటం కంటే.. తమలో తాము పోరాడుకోవడానికే ఇప్పటికీ సమయం కేటాయిస్తున్నారు. తాజాగా హైకమండ్ ప్రకటించిన కమటీల విషయంలో ఆ పార్టీ నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. తమకు ఆ కమిటీలో స్థానం దక్కలేదని..ఈ కమిటీలో చోటిచ్చారని.. తన కంటే జూనియర్లకు పెద్ద పీట వేశారని అసంతృప్తితో బయటకు రావడం ప్రారంభమైంది. మొదట కొండా సురేఖ ప్రారంభించారు. తర్వాత బెల్లయ్య నాయక్ అనే నాయకుడు తనకు ఆ పదవి వద్దని రాజీనామా చేశారు.
మల్లు భట్టి విక్రమార్క్.. ఇలా అసంతృప్తిగా ఉన్న వారితో సమావేశం అవుతున్నారు. ఆయనే వ్యూహాత్మకంగా రెచ్చగొడుతున్నారని.. కాంగ్రెస్లో ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి ఇటీవలి కాలంలో ఆయనే ఎక్కువగా అడ్డం పడుతున్నారు. రేవంత్ పాదయాత్ర చేస్తానంటే.. తాను కూడా చేస్తానని బయలుదేరారు. ఇప్పుడు ఆ పాదయాత్ర ఎటూ కాకుండా పోయింది. మరో వైపు పదవులు ఎక్కువగా రేవంత్ వర్గానికి వచ్చాయంటూ.. ఇతరుల్ని రెచ్చగొట్టి రాజీనామాల వైపు మళ్లిస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యాయం ముగిసింది. అయితే రేవంత్ నాయకత్వం ఇష్టం లేని సీనియర్లు.. భట్టి లాంటి నేతలతో తెర వెనుక ఉండి ఇలా రాజకీయం చేస్తున్నారన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. భట్టి విక్రమార్క కూడా.. ముందు పార్టీ గెలిస్తే ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచించవచ్చని అనుకోవడం లేదు.. పార్టీ గెలిచినా..కాస్త ముందుకెళ్లినా… రేవంత్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందోనని కంగారు పడుతున్నట్లుగా రాజకీయం ఉంది.దీంతో.. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి అటూ ఇటూ కాకుండా అయిపోతోంది