సినిమా గురించి రిలీజ్‌కు ముందు చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడే హీరోల్లో విశ్వక్సేన్ ఒకడు. సినిమాని వీలైనంతగా తన భుజాలపై మోసేస్తుంటాడు. ‘ఈ సినిమా హిట్టు కొట్టకపోతే.. నా పేరు మార్చుకొంటా’ అంటూ స్టేట్మెంట్లు కూడా గుప్పిస్తుంటాడు. సినిమా ప్రెస్ మీట్లలో విశ్వక్ చేసే కామెంట్లు కాక పుట్టిస్తుంటాయి. జనాలు ట్రోల్ కూడా చేసుకొంటారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా గురించి కూడా ఇంతే ఇదిగా మాట్లాడాడు. కానీ.. ఫలితం రాలేదు. అయినా విశ్వక్ ఏం మారలేదు. తన కొత్త సినిమా ‘మెకానిక్ రాఖీ’ సినిమా ట్రైలర్ రిలీజ్ లో కూడా ఇలానే మాట్లాడాడు. ”ఈ సినిమాకు బజ్ లేదూ.. లేదూ అంటున్నారు.. బజ్ లేకపోవడం కాదు.. నేనే ఇవ్వలేదు. ఇక నుంచి ఇస్తా” అంటూ ట్రోలర్స్ కి కావల్సినంత మెటీరియల్ సప్లై చేశాడు.
నవంబరు 22న ఈ సినిమా విడుదల అవుతోంది. 21 రాత్రి పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. దీనిపై కూడా విశ్వక్ మాట్లాడాడు. తాను సినిమా చూసుకొన్నానని, చాలా బాగా వచ్చిందని, ఆ కాన్ఫిడెన్స్‌తోనే పెయిడ్ ప్రీమియర్లు ప్లాన్ చేశామని, 21 రాత్రి సినిమా చూసినవాళ్లు నచ్చేలేదు అంటే… 22న ఎవరూ థియేటర్లకు రావొద్దంటూ బోల్డ్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. విశ్వక్ చేసిన కామెంట్లు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. ‘మనోడేం మారలేదు..’ అంటూ కౌంటర్లు మొదలెట్టేశారంతా.
ఏ సినిమాకైనా మార్కెటింగ్ చాలా అవసరం. కొంతమంది తమ స్పీచులతో సినిమా గురించి జనాలు మాట్లాడుకొనేలా చేస్తారు. విశ్వక్సేన్ ది అదే పద్ధతి. సినిమా గురించి ఇదివరకటిలా ‘బాగుంటుంది.. అదిరిపోతుంది’ అంటే కిక్ రావడట్లేదిప్పుడు. అంతకు మించిందేదో చెప్పాలి. ఇప్పుడు విశ్వక్ ఇదే చేస్తున్నాడు. సినిమా బాగుంటే, ఇలాంటి స్టేట్మెంట్ల గురించి ఎవరూ పట్టించుకోరు. అదే ఫ్లాప్ అయితే మాత్రం జనాలు ఇంకాస్త ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఆ ప్రమాదం ‘మెకానిక్ రాఖీ’కి కూడా పొంచి ఉంది.