తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కొన్ని చోట్ల అభ్యర్థులను మారుస్తారని జరుగుతున్న ప్రచారానికి రేపటితో పులిస్టాప్ పెట్టేయనున్నారు. పార్టీ తరపున ప్రకటించిన 107 మంది అభ్యర్థులకు ఆదివారమే బీఫామ్స్ పంపిణీ చేయబోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ఒకరోజు ముందే బీ-ఫామ్ లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన అనంతరం కేసీఆర్ సంతకం చేసి మరి బీ-ఫామ్ లు అందజేయనున్నారు. గత సెప్టెంబర్ 6న అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పటివరకు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచార శైలి పై ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు. బీ-ఫామ్ ఇచ్చే ముందు తెలంగాణ భవన్ లో వారితో ప్రత్యేకంగా సమావేశమై.. కొన్ని సూచనలు చేయబోతున్నారు.
ఇప్పటివరకు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి..అభ్యర్థుల ప్రచారశైలి…గెలుపు ఓటమిలపై పూర్తిస్థాయిలో ఫీడ్ బ్యాక్ అభ్యర్థుల నుంచే మరోసారి సేకరించనున్నారు. మరోవైపు పార్టీ ప్రకటించని 12నియోజకవర్గల అభ్యర్థులను కూడా… ఇప్పటికే ఖరారు చేశారు. అందరితో పాటే వారికీ… బీ ఫామ్స్ ఇవ్వబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మొత్తం 119నియోజకవర్గాల అభ్యర్థులకు 11నే బీ-ఫామ్ లు అందించబోతున్నారని చెబుతున్నారు. ఆదివారం.. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌజ్ లో కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గజ్వేల్‌లో మళ్లీ తాను ఎన్నికల సభకు రాలేను కాబట్టి.. మీదే బాధ్యత అని కార్యకర్తలకు చెప్పనున్నారు. ఇందు కోసం ఫామ్‌హౌస్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
గజ్వెల్ నుంచి ఈ నెల 15 న నామినేషన్ వేసేందుకు నిర్ణయించుకున్నారు. సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చే గులాబీ బాస్, అదృష్ట సంఖ్య 6 నే నానినేషన్ కు ఫాలో అవుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ ముందు సిద్ది పేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం నామినేషన్ దాఖలు చేశారు కెసీఆర్. ఈ సారి కూడ కోనాయపల్లిలో దర్శనం చేసుకొని నామినేషన్ వేసేందుకు అట్టహాసంగా బయలుదేరతారని తెలుస్తోంది.
సీఎం ఇలాఖాలో కాంగ్రెస్ గెలుస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.