ఊరూవాడా తీవ్ర నిరసన వెల్లువెత్తడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకడుగు వేసేలా చేసింది. చీప్ లిక్కర్ పై సర్కార్ నిర్ణయం మారింది. గుడుంబాను అరికట్టడమే తన కర్తవ్యమని ప్రభుత్వం ప్రకటించింది. చీప్ లిక్కర్ విధానం లేదని స్పష్టం చేసింది.
కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ మీడియా ముందు ప్రకటించారు. ఈ ఏడాది పాత విధానాన్నే కొనసాగిస్తూ, చీప్ లిక్కర్ ప్రవేశ పెట్టకుండా లిక్కర్ పాలసీ ఓకే చేశారు. గుడుంబాను అరికడితే, దానికి అలవాటు పడ్డ వారికి చీప్ లిక్కర్ అందుబాటులో ఉంచడం మంచిదని తెలంగాణ సర్కార్ మొదట భావించింది. దీనిపై నిరసన వెల్లువెత్తింది. విపక్షాలు మండిపడ్డాయి. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీన్ని గుర్తించిన కేసీఆర్, ప్రజల అభిప్రాయం మేరకు వెనక్కి తగ్గారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయించారు. దీనిపై అధ్యయనానికి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఇక, కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంపైనా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 60 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. పెండింగులో ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 3,900 కోట్లు ఖర్చుచేస్తారు. అక్రమాలకు తావులేకుండా, అర్హులకే ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగ నియామకాల వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచారు.