కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందంటూ ఆంధ్రా ఎంపీలు ఢిల్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు బయటా లోపలా తమ స్వరం వినిపించే ప్రయత్నం చేశారు. అనంతరం ఏపీ ఎంపీలు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఆయన సానుకూలంగా స్పందించారనీ, దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తాను తీసుకుని వెళ్తాననీ, ఏపీ ఎంపీలతోపాటు తాను కూడా ప్రధాని దగ్గరకి వస్తానని రాజ్ నాథ్ హామీ ఇచ్చారు. నిజానికి, అంతకుముందు రోజే ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజ్ నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా చెప్పారు. కేంద్రం హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత నోడల్ ఏజెన్సీగా హోం మంత్రిత్వ శాఖకు ఉంటుంది కాబట్టి, ఆ మేరకు రాజ్ నాథ్ సింగ్ కొంత చొరవ తీసుకున్నారని చెప్పొచ్చు.
ఇదీ…తెలుగుదేశం సర్కారు తాము అత్యంత తీవ్రతరం చేశామూ అంటున్న ఒత్తిడికి కేంద్రం నుంచి వచ్చిన స్పందన..! ఇందులో కేంద్రం కొత్తగా చెప్పిందిగానీ, గతం కంటే భిన్నంగా స్పందించిందిగానీ లేదు. మోడీ సర్కారుపై తాము ఒత్తిడి పెంచేశామని టీడీపీ సర్కారు అనుకుంటోందేమోగానీ… దాన్ని భాజపా అంత సీరియస్ గా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. అన్నిటికీమించి.. కేంద్రం నుంచి వస్తున్న ఈ స్పందనను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా అనేదే అసలు ప్రశ్న..? ఎందుకంటే, గతంలో కూడా ఇదే పరిస్థితి చాలా అంశాల్లో పునరావృతం అయింది. ఈ మధ్య పోలవరం అంశమే తీసుకుంటే… కొన్ని టెండర్ల విషయమై కేంద్రం మోకాలడ్డింది. ఆ సమయంలో కూడా కేంద్రం స్పందించడం… రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం లాంటివి జరిగాయి. ఆ తరువాత, పోలవరం పనుల్లో అనూహ్యమైన వేగం కనిపిస్తుందనీ, ఇంకేముంది అంతా అయిపోయిందని అనుకున్నారు. కార్యరూపంలో ఆ వేగం ఇంకా మొదలు కాని పరిస్థితే. ఇదొక్కటే కాదు… ప్రత్యేక హోదా విషయంలో కూడా ఒత్తిడి పెంచామని టీడీపీ చెబుతూ వచ్చింది. చివరికి ఓ ప్యాకేజీ ప్రకటించారు. అదేంటో ఇప్పటికీ స్పష్టత లేదు.
ఇలా ప్రతీసారీ జరుగుతున్నది ఏంటంటే… పొత్తును కాపాడుకోవడం కోసం టీడీపీ ప్రయత్నించడం, కేంద్రం మాటిచ్చింది కదా, సాయం చేస్తుంది అనే నమ్మకంతో ఉండటం! అయితే, ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది. కేంద్ర సాయం రాష్ట్రానికి అవసరం కాబట్టి, కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతారు. కానీ, ప్రజలకు ఇది మరొలా కనిపించే అవకాశాలే ఎక్కువ! ఎలా అంటే… రాజకీయంగా భాజపాను వదులుకోవడం టీడీపీకి ఇష్టం లేదు, అందుకే ఏ అంశం తీసుకున్నా కేంద్ర పెద్దలు ఇచ్చే హామీలను ఇంకా నమ్ముతున్నారనే అభిప్రాయం కొంత బలంగానే వినిపిస్తోంది. ఓరకంగా ఈ సమస్య టీడీపీ నిబద్ధతను ప్రశ్నించే స్థాయికి చేరుకునే దిశగా వెళ్తోంది. ప్రస్తుతం కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. హోం మంత్రి హామీ ఇచ్చారు, తరువాత మోడీ కూడా హామీ ఇస్తారే అనుకుందాం. అక్కడితే ఈ ఒత్తిడి ప్రయత్నాలు ఆగిపోతాయా..? ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చే వరకూ టీడీపీ బలంగా పోరాడుతుందా..? ఇలాంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం టీడీపీకి ఉంది.