అధికార పార్టీలోకి ఇతర పార్టీల నాయకుల వలసలు ఎందుకు ఉంటాయి..? ఆ నాయకులకు ఆర్థిక అవసరాలుండొచ్చు, కేసుల్లాంటివి ఉంటే అధికారం అండ అవసరం ఉండొచ్చు. ప్రజాసేవ సేవ కోసమే పార్టీ మారుతున్నామని మైకుల ముందు చెప్తున్నవారి అవసరాలేంటో ప్రజలకు అర్థమౌతూనే ఉంటాయి! తాజాగా భాజపాలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలూ ప్రధాన వ్యాపకం వ్యాపారాలే కదా! ఎన్నికలకు ముందు కొంతమంది ఎంపీలపై ఐటీ, ఈడీలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో టీడీపీ అధికారంలో రాలేదు. కేంద్రంలో మరోసారి భాజపా వచ్చింది. భవిష్యత్తుపై ఓ అంచనాకి వచ్చి… ఆ నలుగురూ పార్టీ మారిపోయారు. దీంతో ఇకపై వారి వ్యాపారాలపైగానీ, గతంలో ఎదుర్కొన్న అభియోగాల నుంచి కూడా రక్షణ లభించినట్టే అనే అభిప్రాయమే అందరికీ ఉంది. కానీ… అలాంటి రక్షణలేవీ ఒక జాతీయ పార్టీగా భాజపా ఇవ్వదని అంటున్నారు ఎంపీ జీవీఎల్ నర్సింహారావు! అలాంటి డీల్ ఏదీ ఆ నలుగురు ఎంపీల చేరిక సమయంలో జరగలేదని చెబుతున్నారు.
భాజపా సభ్యులైనా కొత్తగా చేరినవారికైనా.. వారు ఎదుర్కొంటున్న అభియోగాల నుంచీ, విచారణల నుంచి ఎలాంటి మినహాయింపూ లభించదన్నారు జీవీఎల్. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిన తరువాతే, వారు అన్నీ ఒప్పుకున్న తరువాతే పార్టీలో చేర్చుకోవడం ఉంటుందని అన్నారు. రాజ్యసభలో తమకు సంఖ్యాబలం తక్కువగా ఉంది కాబట్టి, వారు వస్తామంటే చేర్చుకోవడం జరిగిందన్నారు! అంతేకాదు, భాజపాలోకి రావడమంటే ముందుగానే ఈ క్రమశిక్షణకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని తెలుసుకునే… వారు పార్టీలో చేరారన్నారు. ఇతర రాజకీయ పార్టీలో ఇలాంటి నిబద్ధత ఉండదనీ, వీటన్నింటికీ వాళ్లు సిద్ధపడే వచ్చారన్నారు జీవీఎల్!
ఇదే విషయం ముందుగా చెబితే ఆ నలుగురు టీడీపీ ఎంపీలూ నిజంగా పార్టీ మారతారా..? మేం ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వం, ఐటీ ఈడీ లాంటి సంస్థల దాడులు కొనసాగుతూనే ఉంటాయని ముందే చెప్తే ఏమని అర్థం? తమని చేర్చుకోవడానికి భాజపా సుముఖంగా లేదనే అభిప్రాయమే అవుతుంది! కాబట్టి, ఎందుకు చేర్చుకున్నారూ ఎందుకు వెళ్లారూ అనే చర్చే అనవసరం. అంతెందుకు, పార్టీ మారక ముందు, వెనక… ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. భాజపా ఇచ్చిన అభయ హస్తమేంటనేది ఎవ్వరికైనా అర్థమైపోతుంది! దాని మీద ప్రత్యేకంగా జీవీఎల్ వివరణ ఇవ్వాల్సిన అవసరమూ లేదు.