సినిమా బావుంది – అనే టాక్ తెచ్చుకోవడమే గొప్ప. ఆ మాట అన్నారంటే, వసూళ్లు కుమ్ముకోవాల్సిందే. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. అందరూ ‘పాజిటీవ్’ టాక్ కోసం మొహం వాచిపోయేవాళ్లే. ఫస్ట్ డే ఫస్ట్ షో… ఇంట్రవెల్ పడేసరికే ‘అబ్బే…’ అంటూ మొహాలు వేలాడేసుకుని వస్తున్న ఆడియన్స్ ని చూసి నిర్మాతల గుండెలు తరుక్కుపోతుంటాయి. అలాంటిది ‘మీ సినిమా బాగుందండీ’ అంటే ఆ నిర్మాతకు ఎంత ఆనందం?? గళ్లా పెట్టె గలగలలాడడం ఖాయం. కాకపోతే అదేం విచిత్రమో ఈమధ్య కొన్ని సినిమాలకు మంచి టాకే వచ్చినా, ఆ స్థాయిలో వసూళ్లు అందుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నాయి.
‘గరుడవేగ’ సినిమాతో ఓ హిట్ కొట్టాడు రాజశేఖర్. నిజానికి ఈ సినిమాపై ఎవ్వరికీ ముందు నుంచి అంచనాల్లేవు. రాజశేఖర్ ఫామ్ కోల్పోయి చాలా ఏళ్లవ్వడంతో ఈ సినిమా కూడా అదే జాబితాలో చేరిపోతుందేమో అనుకున్నారు. కానీ ప్రవీణ్ సత్తారు మ్యాజిక్ చేశాడు. గరుడ వేగ హిట్టయ్యింది. అన్ని చోట్లా పాజిటీవ్ స్పందన. రివ్యూలు బాగా వచ్చాయి. ఓపెనింగ్స్ కూడా ఫర్వాలేదనిపించాయి. కానీ.. వసూళ్లు ఆశించినంతగా రాలేదు. బడ్జెట్ పెరిగిపోవడం, రాజశేఖర్ మార్కెట్ బాగా తగ్గిపోవడం ఈ సినిమాపై ప్రభావం చూపించింది. ఇటీవల విడుదలైన ‘మెంటల్ మదిలో’ కూడా మంచి టాకే తెచ్చుకుంది. రేటింగులు అదిరిపోయాయి. కానీ… రెవిన్యూ పరంగా మాత్రం నిరాశ పరిచింది. ఈ స్థాయి రేటింగులకు, పాజిటీవ్ టాక్‌కీ తప్పకుండా గొప్ప వసూళ్లే ఆశిస్తారు. పెళ్లి చూపులులా… భారీ లాభాలు వస్తాయని నిర్మాతలు కలగన్నారు. కానీ అవి కల్లలుగానే మిగిలిపోయాయి.
రామ్ సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’కీ పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. ‘నేను శైలజ’ తరవాత రామ్ ఖాతాలో మరో హిట్ పడిపోయిందనుకున్నారు. కానీ ఈసినిమా బిలో యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. బీ,సీలకు ఈ సినిమా చేరకపోవడం, మల్టీప్లెక్స్‌లలో మరీ అశించిన వసూళ్లు రాకపోవడం, ఓవర్సీస్లో మెప్పించకపోవడంతో ‘ఉన్నది ఒకటే జిందగీ’ వెనుకబడిపోయింది. విశాల్ సినిమా ‘డిటెక్టీవ్’కీ మంచి రేటింగులే పడ్డాయి. దానిదీ అదే పరిస్థితి. చాలా కాలం తరవాత ‘గృహం’తో హిట్టుకొట్టాడు సిద్దార్థ్. తమిళంలో ఈ సినిమాకి మంచి ఆదాయమే వచ్చింది. తెలుగులోనూ అదే తరహా ఫలితాన్ని ఆశించాడు సిద్దార్థ్. కానీ.. బాక్సాఫీసు పరంగా ‘గృహం’ కూడా నిరాశ పరిచింది.