నాగార్జున తాజా చిత్రం ఓం నమో వేంకటేశాయకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఈ సినిమాకి వచ్చిన టాక్… సూపర్. కానీ వసూళ్లు మాత్రం నిరాశ పరుస్తున్నాయి. ఓ సినిమాకి ఇంత మంచి టాక్ వచ్చి కూడా… కలక్షన్లు రాకపోవడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. ఏబీసీ సెంటర్లు మూడు చోట్లా… 40 శాతానికి మించి టికెట్లు తెగలేదు. సోమవారం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఓవర్సీస్లో ఈ సినిమా భారీ నష్టాల్ని మూటగట్టుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేస్తున్నారు. అయితే చిత్రబృందం మాత్రం `వసూళ్లు లేకపోయినా ఫర్వాలేదు.. ఓ మంచి సినిమా తీశామన్న తృప్తి చాలు` అంటోంది.
వసూళ్లపై నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి వివరణ ఇస్తూ.. ”సినిమా చాలా బాగుంది. అయితే వసూళ్లు కాస్త స్లోగా ఉన్నాయి. అన్నమయ్య, శ్రీరామదాసు కూడా ఇంతే కదా. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి కాస్త టైమ్ పడుతుంది” అంటున్నారు. అయితే ఇది వరకటి రోజులు కావివి. జనం లేరంటే… థియేటర్లో సినిమా వారం రోజుల కంటే ఎక్కువగా నిలబడడం కష్టం. ఫ్యామిలీ ఆడియన్స్ మెల్లిగా వచ్చేంత వరకూ థియేటర్లలో సినిమా ఉండాలి కదా? పైగా ఈవారం ఘాజీ విడుదల అవుతోంది. ముందు అనుకొన్న థియేటర్ల కంటే… రెండింతలు ఎక్కువ థియేటర్లు ఈ సినిమాకి దొరికాయి. దానికి గల కారణం.. ఓం నమో వేంకటేశాయ థియేటర్లలో సగానికిపైగా ఘాజీకి ఇచ్చేయడమే. సినిమా పరంగా విశ్లేషకులు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకొన్నా.. బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయిన చిత్రాల్లో ఓం నమో వేంకటేశాయ కూడా ఉంటుందేమో..??