వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు తాము అనుకున్నదే సాధించారు! స్పీకరు మీద నేరుగా విమర్శలు చేయలేరు గనుక.. గౌరవ ప్రదమైన స్థానంలోని సభాపతి మీద నిందలు వేయడం కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది గనుక.. అవిశ్వాసం పెడితే చర్చరూపేణా సభాముఖంగానే నిందలు వేయడం తప్ప వారి లక్ష్యం మరొకటి కాకపోవచ్చునని తెలుగు360 ముందే విశ్లేషించింది. మంగళవారం సాయంత్రం 4.10 గంటలకు జరిగిన ఓటింగ్‌లో అదే జరిగింది. ఈ ఓటింగ్ సందర్భంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పరాభవం ఎదురైంది. నిన్న ప్రభుత్వం మీద ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం మాదిరిగానే.. ఇవాళ స్పీకరు మీద ప్రతిపాదించిన అవిశ్వాసతీర్మానం కూడా వీగిపోయింది.
దీనిని మూజువాణీ ఓటు కాకుండా.. ఓటింగ్ పద్ధతిలోనే నిర్వహించారు. తద్వారా ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా చూసుకున్నారు. స్పీకరు స్థానంలో డిప్యూటీ స్పీకరు మండలి బుద్ధ ప్రసాద్ కూర్చుని.. ఓటింగ్‌ను నిర్వహించారు. తొలుత అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్నవారు లేచి నిల్చోవాల్సిందిగా కోరినప్పుడు వైకాపా సభ్యులు లేచి నిల్చున్నారు. సభ్యులు వారిని లెక్కించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వచ్చిన ఓట్లను లెక్క తేల్చారు.
అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించే వారు లేచి నిల్చోవాల్సిందిగా కోరినప్పుడు.. తెలుగుదేశం సభ్యులంతా లేచి నిల్చున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అధికార పార్టీ సభ్యులందరూ మొత్తం అనుకలమైన వారి గణన పూర్తయ్యే వరకు నిల్చునే ఉన్నారు. అయితే మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ వంటి వారు మాత్రం ఆ సమయంలో కూడా కూర్చునే ఉండడం కనిపించింది. మొత్తం ఓటింగ్ ప్రక్రియ మొదలైనప్పటినుంచి పూర్తయ్యే వరకు అసెంబ్లీ తలుపులు మూసివేశారు. భాజపా సభ్యులు కూడా అవిశ్వాసానికి వ్యతిరేకంగానే లేచి నిల్చుని తమ ఓట్లను తెలియజేశారు.
మొత్తానికి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 57 ఓట్లు (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారివి) మాత్రమే వచ్చాయి. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 97 ఓట్లు వచ్చాయి. దీనితో అవిశ్వాసం వీగిపోయినట్లుగా స్పీకరు స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకరు మండలి బుద్ధ ప్రసాద్ ప్రకటించారు. అవిశ్వాసం వీగిపోవడంతో స్పీకరుగా కోడెల శివప్రసాద రావు ను సమావేశానికి ఆహ్వానిస్తున్నాం అంటూ మండలి బుద్ధప్రసాద్ ఓటింగ్ ఫలితాన్ని వెల్లడించిన తర్వాత ప్రకటించారు.
అంతకుముందు స్పీకరు కోడెల శివప్రసాద్ మీద చాలా వాడి వేడిగా చర్చోపచర్చలు జరిగాయి. స్పీకరు సభలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే అంశం దగ్గరినుంచి, రోజా సస్పెన్షన్, జగన్ ప్రసంగానికి అడ్డుపడినా పట్టించుకోకపోవడం, అధికార పార్టీ సభ్యులు అసభ్యపదాలు వాడినా వారించకపోవడం వంటి అనేక ఆరోపణలు వైకాపా సభ్యులు చర్చ సందర్భంగా వినిపించారు. అలాగే కోడెల ఇంట్లో గతంలో బాంబులు పేలాయి వంటి పాత సంగతులను కూడా తవ్వి నిందించే ప్రయత్నం చేశారు. సభాపతి స్థానం మాత్రమే కాకుండా, అసలు ఏ వ్యవస్థ మీద కూడా జగన్‌కు నమ్మకం లేదంటూ అధికార పార్టీ వారు ఎదురు దాడికి దిగారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి సభాపతి గౌరవాన్ని మంటగలపడం కరెక్టు కాదని వాదించారు. గతంలో ఎన్నో పదవులకు వన్నె తెచ్చిన చరిత్ర కోడెల శివప్రసాదరావుకు ఉన్నదంటూ వారు వెనకేసుకు వచ్చారు.
ట్విస్టు ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి ఇటీవలి పరిణామాల్లో ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలు ఈ ఓటింగ్ సమయానికి సభకు గైర్హాజరయ్యారు.