అవిశ్వాస తీర్మానంలో భారతీయ జనతాపార్టీ… గట్టెక్కదని ఎవరూ అనుకోవడం లేదు. చివరికి విపక్ష పార్టీలు కూడా తమ లక్ష్యం ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదంటున్నారు. కానీ బీజేపీకి మాత్రం టెన్షన్ ప్రారంభమయింది. కొంత మంది ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగురవేసినట్లు ప్రచారం జరుగుతూండటమే దీనికి కారణం. అయితే ఈ జాబితాలో షాట్ గన్ శతృఘ్నసిన్హా లేరు. ఈయన గత కొద్ది కాలంగా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ, అమిత్‌షాలను వ్యతిరేకిస్తున్న బీహార్ నేత.. ఇపుడు అవిశ్వాసానికి మద్దతుగా, బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ సిన్హా మాత్రం విప్‌ను శిరసావహిస్తానన్నారు.
గత పార్లమెంట్ సమావేశాల సమయంలో బీజేపీ హైకమాండ్‌పై తిరుగుబాటు చేసిన ఎంపీ సావిత్రి భాయ్ పూలే. యూపీకి చెందిన ఈమె… ఎటు మొగ్గుతారోనన్న సందేహం బీజేపీలో ప్రారంభమయింది. మాయవతితో ఈమె టచ్‌లో ఉన్నారని యూపీలో ప్రచారం జరుగుతోంది. వీళ్లే కాదు.. అశోక్ దొహ్రే, చోటే లాల్, రాజ్‌కుమార్ సైని అనే ముగ్గురు ఎంపీలు కూడా బీజేపీని టెన్షన్ పెడుతున్నారు. వీరు ముగ్గురూ.. హైకమాండ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ అగ్రనేతలు మాత్రం పార్టీ రెబల్స్‌కు వార్నింగ్‌లిస్తున్నారు. ముందు ఎన్నికలు ఉన్నాయి జాగ్రత్తా..? అని బెదిరిస్తున్నారు.
కొందరు పార్టీపై అసంతృప్తితో ఉంటే.. మరికొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంకొందరు విదేశాల్లో ఉన్నారు. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ కీర్తి ఆజాద్ గైర్హాజరయ్యే అవకాశం ఉంది. మరో ముగ్గురు ఎంపీలు గైర్హాజరయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు ఇప్పటికే నిర్దారణకు వచ్చాయి. తమకు ఉన్న బలంలో.. ఆరు ఓట్లు కచ్చితంగా తగ్గుతాయని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. దానికి అనుగణంగానే వ్యూహరచన చేసుకుంటోంది. అయితే మాయావతి మాత్రం.. యూపీలోని సిట్టింగ్ బీజేపీ ఎంపీలను…తిరుగుబాటుకు ప్రొత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఆమె ఎవర్నైనా తన పార్టీ వైపు ఆకర్షిస్తే మాత్రం… బీజేపీ పరువు పోతుంది.