నిన్నట మాట ఇది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ జరుగుతోంది..! పార్లమెంటులో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని ఎండగట్టడమే ప్రధాన అజెండాగా జగన్ మాట్లాడారు. ఆయన ప్రసంగం అయిపోయాక, కొంతమంది విలేకర్లు ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నల్లో ఒకటి… అసెంబ్లీలో భాజపాతో కలిసి, చంద్రబాబు సర్కారుపై వైకాపా అవిశ్వాస తీర్మానం పెడుతుందట కదా అని! దీనిపై జగన్ స్పందిస్తూ… ఈ విషయం తనకు తెలీదనీ, సాంకేతిక అంశాలు తెలుసుకుని ఇలాంటి ప్రశ్నలు అడగాలంటూ ఆ టాపిక్ ను అక్కడితో జగన్ కట్ చేశారు. దీంతో ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యత లేదేమో అనే అభిప్రాయం ఏర్పడింది. కానీ, ఇప్పుడు ఏపీ భాజపా నేతలు ఇదే టాపిక్ మీద మాట్లాడటం చూస్తే… ఏదో ఉందనే అనుమానాలే కలుగుతున్నాయి!
ఎమ్మెల్సీ మాధవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ… భాజపాపై బురద జల్లే కార్యక్రమంలో తెలుగుదేశం పూర్తిగా విఫలమైందన్నారు. లోక్ సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం వల్ల ఆ పార్టీకి చాలా నష్టమన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబుపై అవిశ్వాసం విషయమై ప్రస్థావిస్తూ… ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ సీపీ తమకు సహకరిస్తే, టీడీపీకి వ్యతిరేకంగా తీర్మానం పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించడం విశేషం. అయితే, ప్రతిపక్ష పార్టీ వైకాపా అసెంబ్లీకి రావడం లేదనీ, ప్రజల పక్షాన నిలబడకుండా బాధ్యతల్ని విస్మరిస్తోందనీ విమర్శించారు. రాష్ట్రంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే తెలుగుదేశం ఎంపీలు తమపై బురదచల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారంటూ మాధవ్ ఆరోపించారు.
మొత్తానికి, టీడీపీ సర్కారుపై అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన భాజపాకి కూడా లోలోప ఉందన్న కథనాలను బలం చేకూరినట్టయింది. అయితే, సాధ్యాసాధ్యాల దృష్ట్యా చూసుకుంటే…. అది భాజపాకి సాధ్యమయ్యే అంశం కాదు. ఎందుకంటే, ఏపీ అసెంబ్లీలో వారికున్న సంఖ్యాబలం ఏపాటిది..? కాబట్టి, వైకాపా మద్దతు కోరుతున్నారు. అలాగని, వైకాపా మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధం కాదు. అదే పనిచేస్తే… భాజపా, వైకాపా కుమ్మక్కు పూర్తిస్థాయిలో బహిర్గతమైనట్టు అవుతుంది. పోనీ, వారే స్వయంగా అవిశ్వాస తీర్మానం పెడతారా… అంటే, ఆ దిశగా వైకాపా ఆలోచిస్తుందా అనేదీ ప్రశ్న..? ఎందుకంటే, అసెంబ్లీ సమావేశాలను వారు పూర్తిగా బహిష్కరించేశారు. సభలో న్యాయం జరగదనీ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వరకూ అసెంబ్లీ గడప తొక్కేది లేదనీ, ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామంటూ భీష్మించేశారు.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వైకాపా ఏదో ఒకటి చేయాల్సిన రాజకీయ అవసరం ఉంది. ప్రత్యేక హోదా అంశమై గత సమావేశాల్లో ఎంపీలతో రాజీనామాలు చేయించి, కొంత అప్పర్ హ్యాండ్ ను జగన్ ప్రదర్శించారనీ అనుకోవచ్చు. కానీ, తాజాగా పార్లమెంటులో అవిశ్వాసానికి వచ్చేసరికి.. వైకాపా ఎంపీలు చేసిన రాజీనామాల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదనేది ఏపీ ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమైపోయింది. ఇంకోటి.. ప్రస్తుతం ఏపీలో చర్చంతా భాజపా వెర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా మారింది. దాన్ని డైవర్ట్ చేస్తూ… తమ పోరాటాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయాలంటే టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అది అవిశ్వాసమే అయితే మరింత చర్చ జరిగే అవకాశం కచ్చితంగా ఉంటుంది. కానీ, అది సాధ్యమా అనేదే చర్చ! భాజపా, వైకాపాలకు ఈ ఆలోచన కచ్చితంగా ఉందనే అనిపిస్తోంది. కార్యరూపం దాల్చడమే ప్రశ్న..?