కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలలో ఆరేడుగురు వెనక్కి వస్తున్నారని ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తుంది. అయితే హఠాత్తుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన దాడి .. .. ఆ తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు, చాలెంజ్‌లు చూస్తే ఎవరూ వెనక్కి వచ్చే ఉద్దేశంలో లేరని అనుకోవచ్చు. అందుకే ఇలా రెచ్చిపోతున్నారని అనుకోవచ్చు. నిజంగా వెనక్కి వచ్చే వారిని మరింత పాంపరింగ్ చేసి.. వెనక్కి తెచ్చుకుంటే కాంగ్రెస్ ఇమేజ్ ఎంతో కొంత తగ్గేది. గతంలో గద్వాల ఎమ్మెల్యే అలా వెళ్లి.. మళ్లీ బీఆర్ఎస్ లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ బీఆర్ఎస్ నేతలు రానివ్వలేకపోయారు.
పార్టీ మారడం అనేది చిన్న విషయం కాదు. అన్ని ఆలోచించుకునే చేసి ఉంటారు. మళ్లీ మళ్లీ వారు పార్టీ మారిపోతే వారి రాజకీయ ఇమేజ్ మసకబారిపోతుంది. అందుకే అంత ఈజీగా నిర్ణయం తీసుకోకపోవచ్చు. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి విపక్ష పార్టీలోకి వెళ్లడం అనేది అసాధ్యం. అది ఎన్నికలకు ముందు జరుగుతుంది కానీ.. అధికారం ఇంకా నాలుగేళ్లు ఉన్నప్పుడు జరగడం అసాధ్యం అనుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది. మా ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు కానీ.. పరిస్థితి భిన్నంగా ఉంది.
సంక్రాంతి తర్వాత మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని..కాంగ్రెస్ లో చేరుతారని పీసీసీ చీఫ్ చెబుతున్నారు. ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యేలు రెడీగాఉన్నారో లేదో కానీ..మైండ్ గేమ్ మాత్రం ఆడుతున్నారు. ఇప్పటికీ చేతుల్లో ఉన్న ఎమ్మెల్యేలు పోకుండా బీఆర్ఎస్ చూసుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యేలు వెళ్లిపోతే అది కేటీఆర్ స్వయంకృతమే అవుతుంది. పార్టీలో ఆయన కొంత మంది ఎమ్మెల్యేలపై వివక్ష చూపిస్తున్నారని.. పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నారన్న అసంతృప్తి కనిపిస్తోందంటున్నారు.