మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ ముగిసిపోయిందని… బీసీసీఐ గట్టి సంకేతాలు పంపింది. ప్రతీ ఏటా.. ఆటగాళ్లకు ఇచ్చే కాంట్రాక్టుల్లో ఈ సారి ధోనీ పేరు మిస్ అయింది. ఆటగాళ్లకు నాలుగు కేటగిరీల్లో బీసీసీఐ కాంట్రాక్టులిస్తుంది. ఏ ప్లస్ , ఏ,బీ, సీ అనే కేటగిరీల్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు ఏడాది పాటు నిలకడైన వేతనం ఇస్తుంది. ఏ ప్లస్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా మాత్రమే చోటు దక్కించుకున్నారు. వీరికి ఏడాదికి ఏడు కోట్లు చెల్లిస్తారు. గత ఏడాది ధోనీకి ఏ కేటగరిలో చోటు కల్పించారు. ఈ ఏడాది పూర్తిగా మర్చిపోయారు. ప్రపంచకప్ సెమీఫైనల్లో..న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత ధోనీ మళ్లీ ఇంత వరకూ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు.
అయితే ఐపీఎల్ ఆడారు. మళ్లీ ఎప్పుడు మ్యాచ్ లు ఆడతారో.. క్లారిటీ లేదు. అలాగని రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు. టెస్టులకు ఎప్పుడో గుడ్ బై చెప్పారు. త్వరలో వన్డేలనూ వదులుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీంతో.. కాంట్రాక్టుల జాబితా నుంచి ధోనీని తప్పించినట్లుగా తెలుస్తోంది. నిజానికి బీసీసీఐలో కొద్ది రోజులుగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సౌరవ్ గంగూలీ బీసీసీఐ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత తనదైన ముద్ర వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పూర్తిగా ప్రొఫెషనలిజంతో… టీం ఎంపిక ఉండాలన్న అభిప్రాయంతో.. గంగూలీ ఉన్నారని అంటున్నారు.
ఈ క్రమంలో.. ఆయన ధోనీ ఎంపీక … పూర్తిగా ఇప్పుడు చూపిన ప్రతిభ ఆధారంగా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో.. ధోనీ ఇక టీ ట్వంటీలకు పరిమితం కావడమో..లేదా… వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చే ఆలోచనను బీసీసీఐ కల్పించడమో చేస్తుందని అంటున్నారు. మొత్తానికి ధోనీ ఇప్పటికి చాలా సార్లు రిటైర్ అవబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ.. అది ఇప్పుడు ముంచుకొచ్చేసినట్లుగా కనిపిస్తోంది.