ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు సహా పన్నెండు మంది అరెస్ట్ చేసి .. రెండు నెలలు దాటిపోయింది. ఇంత వరకూ ఏసీబీ చార్జిషీటు దాఖలు చేయలేదు. ఏ -3 నిందితుడుగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. ఆయనను ఇంకా అరెస్ట్ చేయలేదని చెబుతూ.. ఇప్పటి వరకూ అరెస్ట్ చేసిన నిందితులకు బెయిల్ రాకుండా.. .ఏసీబీ అధికారులు ఓ ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుననాయి. ఈ సమయంలో.. ఈ కేసును పర్యవేక్షిస్తున్న ఏసీబీ ఉన్నతాధికారి రవికుమార్ హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చారు. ఎప్పుడూ చెప్పే వివరాలే చెప్పి మీడియాకు ప్రత్యేక ఇంటర్యూలు ఇచ్చారు. అయితే.. ఈ మీడియా ఇంటర్యూల్లో ఆయన కొన్ని ఆసక్తికమైన విషయాలు చెప్పారు. అదేమిటంటే.. వందల కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారు కానీ.. పట్టుబడిన వారి దగ్గర అక్రమ సొత్తు ఎంత స్వాధీనం చేసుకున్నారనేది మాత్రం చెప్పడం లేదు. ముఖ్యంగా అచ్చెన్నాయుడుకు నగదు ముట్టినట్లుగా ఎలాంటి ఆధారాల్లేవని.. చెప్పడం ఆసక్తికరంగా మారుతోంది.
తెలంగాణలోనూ ఈఎస్ఐ స్కాం జరిగింది. అక్కడ ఏసీబీ కూడా చురుగ్గా వ్యవహరించింది. అవినీతి లావాదేవీలను వెలికి తీసింది. ఏ ఏ అధికారి ఎంత పెద్ద మొత్తంలో నగదు అందుకున్నారో.. బ్యాంక్ లావాదేవీలు.. ఆస్తుల వివరాలతో సహా వెల్లడించింది. అదీ కేసు. కానీ ఏపీలో ఈఎస్ఐ స్కాంలో వందల కోట్ల అవినీతి జరిగిందంటున్న ఏసీబీ అధికారులు ఎంత అక్రమ సొమ్ము…. అచ్చెన్నాయుడుకి చేరిందో… ఏ రూపంలో చేరిందో.. కనిపెట్టి ఉండాల్సింది. కానీ అలాంటి ఆధారాల్లేవంటున్నారు. పోనీ అరెస్ట్ చేసిన ఇతర అధికారుల వద్దనైనా అక్రమ లావాదేవీల సొమ్ము కనిపెట్టారా అంటే అదీ లేదు. అక్రమ లావాదేవీలను గుర్తించినట్లుగా ప్రకటించలేదు.
అచ్చెన్నాయుడు అవినీతికి సంబంధించి సొమ్ము లావాదేవీల కోసం ఎక్కడా సోదాలు చేసినట్లుగా కానీ.. టెలీ హెల్త్ సర్వీసెస్‌కు నోటీసులు ఇచ్చినట్లుగా కానీ.. లేదు. మొత్తం.. అవినీతి అని చెప్పాలంటే.. ముందుగా… దాన్ని చేసిన వారు ఎలాంటి ప్రతిఫలం పొందారో చెప్పాలి. కానీ ఏసీబీ ఇక్కడ అలాంటి ప్రతిఫలాన్ని ఎవరు .. ఎలా పొందారో చెప్పడం లేదు. ఏసీబీ అధికారులు ఇప్పుడు అవినీతి అనే పదం ఎక్కువ వాడకుండా.. నిధుల దుర్వినియోగం అనే పదాన్ని వాడుతున్నారు. నిధుల దుర్వినియోగం అనేది.. పూర్తిగా వేరే సబ్జెక్ట్. అవినీతి అని దానిని అనలేరు. అసలు నిధులు దుర్వినియోగం అంటే.. ఏమిటో స్పష్టమైన నిర్వచనం ఇప్పటి వరకూ లేదు. ఏసీబీ అధికారులు ఏది అనుకుంటే అదే దుర్వినియోగం అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అచ్చెన్నాయుడు కేవలం మూడు లేఖలు మాత్రమే రాశారని… ఏసీబీ ఉన్నతాధికారి రవికుమార్ చెబుతున్నారు. ఆ లే్ఖల కారణంగానే అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసి.. బెయిల్ రాకుండా.. విచారణలో జాప్యం చేసి.. కొంత మంది నిందితుల్ని కూడా అరెస్ట్ చేయకుండా.. చార్జిషీట్ దాఖలు చేయకుండా.. ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చెప్పిన వందల కోట్ల అవినీతి సొమ్మును ఏసీబీ బయట పెట్టకపోతే … అనుమానాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.