సజీవంగా ఉన్న వ్యక్తి హత్యకు గురయ్యాడని దర్యాప్తు చేసినట్లుగా ఉంది
సీమెన్స్ గ్లోబల్ మార్కెటింగ్ వ్యూహంలో భాగంగానే 90:10 ఒప్పందం
ప్రాజెక్టు విజయవంతమైనదని కెపిఎంజి నివేదికను కూడా విస్మరించారు
సీమెన్స్ సాఫ్ట్ వేర్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరక్టర్ సుమన్ బోస్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని సీమెన్స్ సాఫ్ట్ వేర్ ఇండియా మాజీ ఎండి సుమన్ బోస్ స్పష్టంచేశారు. న్యూడిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఆదివారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక వివరాలను తెలియజేశారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కింద మొత్తం 232,000 మంది విద్యార్థులు శిక్షణ పొందారని, వారిలో చాలామంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. దేశంలో 200కు పైగా ల్యాబ్‌లను ప్రారంభించాం, సీమెన్స్ కంపెనీ, ఏపీఎస్ఎస్డీసీ మధ్య ఒప్పందం ఉంది, ఒక సాప్ట్ వేర్‌పై యువతకు అవగాహన కల్పిస్తే దానికి డిమాండ్ పెరుగుతుంది, మార్కెటింగ్ వ్యూహంలో భాగంగానే 90:10 ఒప్పందం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ హై-ఎండ్ ఇంజినీరింగ్ నైపుణ్యాలను మాత్రమే కాకుండా మధ్య-శ్రేణి, తక్కువ-శ్రేణి నైపుణ్యాలను అందించే లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం వహించినట్లు సుమన్ బోస్ పేర్కొన్నారు. తొలుత 36 కేంద్రాలను ఏర్పాటుచేశామని, తర్వాత 40కిపైగా విస్తరించినట్లు చెప్పారు.
కాంట్రాక్ట్ ప్రకారం రెండేళ్లపాటు తాము నిర్వహించడం, ఆ తర్వాత మరోఏడాది పాటు సేవలు అందించడం, అన్ని దశలు పూర్తయిన తర్వాత దానిని ప్రభుత్వానికి బదిలీ చేయడం ఈ ప్రాజెక్టు ఒప్పందంలో అంతర్భాగమని వివరించారు. ప్రధానంగా వ్యవసాయ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, ఐటీ రంగం గణనీయంగా విస్తరించిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భిన్నంగా ఉందని సుమన్ బోస్ తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు యువశక్తిని సిద్ధం చేయాలని భావించింది. ఈ విజన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రస్తుత వైఖరిపై సుమన్ బోస్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, 2021లో APSSDC నుండి సీమెన్స్ ప్రశంసా పత్రాన్ని అందుకుంది, అదే సంవత్సరం కంపెనీపై కేసు నమోదైందని అన్నారు. 2021లో 40 కేంద్రాల పూర్తి వివవరాలతో డాక్యుమెంట్, ఇన్వెంటరీ వివరాలను ప్రభుత్వానికి అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. 2021 వరకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 2.32 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ పద్దతిలో ఈ ప్రాజెక్టు నడిచింది, 2021లో ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించినట్లు చెప్పారు. 2018లోనే ఈ ప్రాజెక్టు నుంచి నేను బయటకు వెళ్లిపోయాను. 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌ను అత్యంత విజయవంతమైన కేస్ స్టడీగా పేర్కొన్న KPMG నివేదికను సైతం పూర్తిగా విస్మరించారని సుమన్ బోస్ పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ ఈ కేంద్రాలను ఎన్నడూ సందర్శించకుండానే ప్రాజెక్ట్ మోసపూరితమైనదిగా ముద్ర వేయడం దారుణమని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ యొక్క పరిధి ఎండ్-టు-ఎండ్ డెలివరీని కలిగి ఉంటుందని, కేవలం హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను సరఫరా చేయడం మాత్రమే కాదని స్పష్టం చేశారు. సీమెన్స్ తన భాగస్వాములతో ప్రాజెక్ట్ డెలివరీలో నిమగ్నమైన వందలాది మంది భాగస్వాములతో ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నడిపించిందని తెలిపారు. ఇందులో అవకతవకలు జరిగాయని సిఐడి దర్యాప్తు చేయడం హత్యకు గురైనట్లుగా చెబుతున్న బాధితుడు సజీవంగా ఉండగానే హత్యకు గురయ్యాడని దర్యాప్తు చేసినట్లుగా ఉందని అన్నారు. ప్రాజెక్ట్‌కి సీమెన్స్ అందించిన సహకారాన్ని సుమన్ బోస్ వివరిస్తూ వారి ప్రమేయం డిస్కౌంట్ల రూపంలో ఉందని, డబ్బురూపంలో కాదని స్పష్టం చేశారు. డిస్కౌంట్ల ద్వారా సమకూర్చిన ప్రయోజనంలో అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిశ్రమల మౌలిక సదుపాయాలను రూపొందించడంలో APSSDC ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించగా, సిమెన్స్ సాంకేతిక భాగస్వామిగా పనిచేసింది. సీమెన్స్ ప్రాజెక్ట్ ఉత్పత్తులు, సాఫ్ట్వేర్లను కూడా సరఫరా చేసింది, ఇది ఒకే కంపెనీ ద్వారా అమలు చేయబడదు. డిజైన్‌టెక్ సంస్థ సిస్టమ్ ఇంటిగ్రేషన్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ మరియు ఫ్యాకల్టీతో సహా అన్ని భాగాలను సమన్వయ బాధ్యతలు నిర్వర్తించినట్లు చెప్పారు.
ప్రాజెక్టును ప్రారంభించే సమయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాతో మాట్లాడుతూ… మేము హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినప్పుడు శిక్షణ పొందిన వారందరూ అక్కడ పని చేయలేదు. వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నతస్థానాలకు చేరి, రాష్ట్ర అంబాసిడర్లుగా మారారు. ఏపీలో ఉన్న యువతకు ఉపాధి లభించేలా శిక్షణ ఇవ్వండి. కియా మోటార్స్ వంటి బడా కంపెనీలు ఎపిలో పెట్టుబడులు పెట్టినప్పుడు అక్కడ పనిచేసే సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం మా బాధ్యత అని చంద్రబాబు చెప్పారన్నారు. ప్రాజెక్ట్‌లో ఎటువంటి అవినీతి జరగలేదు, మాజీ సిఎంపై అన్యాయంగా కేసులు పెట్టారని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో శిక్షణ పొందిన 2.13లక్షల మంది విద్యార్థుల జీవితాలపై ఇటువంటి ఆరోపణలు హానికరమైన ప్రభావాన్ని చూపుతాయని సుమన్ బోస్ పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వంలో భాగం కాదా? ఏలాంటి మనీలాండరింగ్ జరగలేదు. ఈ వ్యవహారం కోర్టుల పరిధిలో ఉన్నందున కోర్టులకు అన్ని విషయాలు చెబుతాం. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ముగ్గురి మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం, ఇదే తరహా ప్రాజెక్టు చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం. నా జీవితంలో నేను సంపాదించుకున్నది గౌరవాన్ని, వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే మీ ముందుకు వచ్చానని చెప్పారు.