తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవిత బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తే పేజీలకు పేజీల ఫోటోలతో సహా ప్రచారం కల్పించేది నమస్తే తెలంగాణ దినపత్రిక . అయితే అది అప్పుడు.. ఇప్పుడు కాదు. ఇప్పుడు కవితకు నమస్తే తెలంగాణలో ప్రచారం కనిపించడం లేదు. అడపాదడపా ఓ ఫోటో కనిపించడం కూడా దుర్లభంగా మారింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాలతో పాటు టీఆర్ఎస్లోనూ చర్చనీయాంశమవుతోంది. కేటీఆర్, కవిత మధ్య కొంత కాలంగా రాజకీయ విభేదాలు ప్రారంభమయ్యాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు కానీ.. వారు మాత్రం బయటపడలేదు.
కానీ ఇప్పుడు నమస్తే తెలంగాణలోనే కవితకు కవరేజీ రాకపోతూండటంతో ఇది నిజమేమోనన్న అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లోనూ ఎక్కువగా వినిపిస్తోంది. గత రాఖీ పండుగ రోజు కూడా ఆమె ఇండియాలో లేరు. ఆమెరికాలో ఉన్నారు. ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. అయితే కేటీఆర్ మాత్రం రెస్పాండ్ కాలేదు. పలు సందర్భాల్లో కవితను కేటీఆర్ దూరం పెట్టారని కొంత మంది గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కనుసన్నల్లో నడిచే నమస్తే పత్రికలోనూ ఆమెకు కవరేజీ దక్కకపోతూండటం ఆసక్తికరంగా మారింది.
సాక్షి పత్రికలో షర్మిల ను బ్యాన్ చేసినట్లుగానే నమస్తేలో కవితకు కవరేజీ ాకుండా చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో షర్మిలకు సాక్షిలో మంచి కవరేజీ వచ్చేది. కానీ అన్న జగన్తో రాజకీయంగా విభేదించిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత తగ్గించారు. సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయన్న కారణంగా ఇప్పుడు స్వల్పంగా కవరేజీ ఇస్తున్నారు. కవితకు కూడా సొంత మీడియాలో అలాంటి నిరాదరణే ఎదురవుతోందన్న రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.