కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రభుత్వం షరతులు, పరిమితులు, నిబంధనలు పెట్టడం మినహా ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతోంది. కనీసం `థియేటర్లు బంద్` అన్న మాట కూడా ప్రభుత్వాల నోటి నుంచి రావడం లేదు. ఇవి కేవలం చిత్రసీమ తీసుకున్న నిర్ణయం. షూటింగులు కూడా అంతే. ఫిల్మ్ ఛాంబర్ కొన్ని పరిమితులతో షూటింగులకు అనుమతి ఇచ్చింది. 40 నుంచి 50 మంది బృందంతో షూటింగులు చేసుకోవచ్చని చెప్పింది. కానీ.. అలా జరగడం లేదు.
టాలీవుడ్ కి చెందిన పెద్ద సినిమాలు కొన్ని యదేచ్ఛగా షూటింగులు జరుపుకుంటున్నాయి. సెట్లో వందల మంది ఉంటున్నారు. నిబంధనల మాట దేవుడెరుగు.. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. హైదరాబాద్ శివార్లలో ఓ పెద్ద సినిమా షూటింగ్ జరుగుతోంది. సెట్లో రెండొందల మంది తక్కువ కాకుండా జనం ఉంటున్నార్ట. అందరి మొహాలకూ మాస్క్లు కనిపిస్తున్నా, శానిటజైషన్, భౌతిక దూరం లాంటివి అస్సలు పాటించడం లేదని సమాచారం. తమ సినిమాల షూటింగుల్ని వీలైనంత త్వరగా ముగించాలని… నిర్మాతలు తాపత్రయ పడుతున్నారు గానీ, యూనిట్ సభ్యుల రక్షణ సంగతి గాలికి వదిలేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సెట్లో ఒకరికి కరోనా వచ్చిందనుకోండి. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని, ఆ సంగతి బయటకు వస్తే, షూటింగు ఆగిపోతుందన్న భయంతో ఇలా చేస్తున్నారని… సెట్లో సభ్యులే చెప్పుకుంటున్నారు. హీరోలు, హీరోయిన్లు, బడా ఆర్టిస్టులు అన్నీ జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. తమ షాట్ అయిపోగానే.. కార్ వాన్ లోకి వెళ్లిపోతున్నారు. మరి లైట్ బోయ్స్, కెమెరా అసిస్టెంట్లు, జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితేంటి? వాళ్లు ఆ సమూహంలో పనిచేయాల్సిందే.
షూటింగులు ఆగిపోతే.. నిర్మాతలకు లక్షల్లో నష్టం వస్తుంది. కాబట్టి… ఆపేయమని ఎవరూ చెప్పరు. కానీ కనీస జాగ్రత్తలైనా తీసుకోవాలి కదా. కరోనా కారణంగా ప్రాణాలు పోతే.. ఎవరిది బాధ్యత? ఆ కుటుంబాల్ని ఆదుకునేవాళ్లు ఎవరు? షూటింగులు చేయాలా, వద్దా అన్నది నిర్మాతల స్వ నిర్ణయం. వాళ్ల రిస్క్ వాళ్లది. కానీ నిబంధనలు అంటూ కొన్ని ఉంటాయి కదా. వాటి పర్యవేక్షణ చేసేదెవరు? షూటింగులు విషయంలో చిత్ర సీమ కట్టుదిట్టమైన నియమావళి పాటిస్తే మంచిది. లేదంటే.. అమాయకులు, పొట్ట కూటి కోసం ప్రాకులాడేవాళ్లు బలైపోతుంటారు.