ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా మారింది. ఆరున్నరేళ్ల కిందట.. రాష్ట్రం విడిపోయిన కొత్తలో.. కష్టాలున్నా.. చంద్రబాబు 44 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా ఇంకా ఏదో ఆశించారు కానీ.. ఇప్పటి వారి ఆశలు ఆడియాశలుగానే ఉండిపోతున్నాయి. కరోనా కారణం చెప్పి.. రెండు నెలల పాటు సగం…సగం జీతాలు కోత వేయడమే కాదు.. ఇవ్వాల్సిన డీఏలన్నీ పెండింగ్ పెట్టేశారు. ఇప్పుడు వాటి కోసం ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. ఇక పీఆర్సీ గురించి ఆలోచించే తీరిక కూడా ఉండటం లేదు. అసలు డీఏలే ప్రభుత్వం ఇవ్వడంలేదు.. ఇక పీఆర్సీ ఇస్తుందా అని ఉద్యోగాలు నిట్టూరుస్తున్నారు.
పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం జీతం బకాయిలు చెల్లించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఎప్పుడెప్పుడు చెల్లిస్తామో కూడా చెప్పింది. ఓ డీఏ కూడా ఇస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఏపీలో మాత్రం ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి ప్రభుత్వం… టీ , కాఫీలు ఇచ్చి బుజ్జగిస్తోంది. వచ్చే రెండు నెలల్లో బకాయిలు చేల్లిస్తామని.. ఓ డీఏ కూడా ఇస్తామని బేరాలు ఆడుతోంది. ఈ బేరాలు ఉద్యోగ సంఘాల నేతల్ని నిస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఇలా వ్యవహరిస్తోందేమిటని మథనపడుతున్నారు.
ఉద్యోగ సంఘాల నేతల్లో ఎక్కువ మంది ప్రభుత్వానికి సరెండర్ అయినట్లుగా మాట్లాడుతూండటంతో.. ఏం చేయాలో ఇతర ఉద్యోగులకు అర్థం కావడం లేదు. దసరా పండుగకు అయినా జీతం బకాయిలు ఇప్పిస్తారేమోనని ఆశ పడిన వారికి నిరాశే ఎదురయింది. అదే సమయంలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. వారిని బుజ్జగించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నించకపోగా… గత ప్రభుత్వ బకాయిలు చెల్లించామని ఇప్పుడు నిధుల్లేవన్న కారణాలు చెబుతూ.. లేఖలు విడుదల చేస్తున్నారు. దీంతో ఉద్యోగులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.