దేశంలో మరణ శిక్షను రద్దు చేయాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. అయితే తీవ్రవాద కేసుల్లో మరణశిక్షను కొనసాగించాలని సూచించింది. తొమ్మిది మంది సభ్యుల లా కమిషన్ ఈ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది.
అయితే, మొత్తం తొమ్మిది మంది సభ్యుల్లో ముగ్గురు మాత్రం మరణ శిక్షను కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. అత్యంత అరుదైన కేసుల్లో ఉరి శిక్ష తప్పనిసరి అని వారు తేల్చి చెప్పారు. మిగిలిన ఆరుగురూ తీవ్ర వాద కేసులు మినహా మిగతా కేసుల్లో మరణశిక్ష విధించ వద్దని అభిప్రాయపడ్డారు.
మరణశిక్షకు అనుకూలంగా, వ్యతిరేకంగా దేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. దీన్ని నిషేధించాలని మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 98 దేశాలు మరణ శిక్షను పూర్తిగా రద్దు చేశాయి. మరికొన్ని దేశాలు సాధారణ కేసుల్లో మరణ శిక్షను రద్దు చేశాయి. అత్యంత అరుదైన, క్రూరమైన నేరం చేసిన వారికి మరణ శిక్షే సరైందని వాదించే వారి సంఖ్యే ఎక్కువ. అయితే మనిషి జీవించే హక్కును హరించే మరణ శిక్ష అమానవీయని పలు సంఘాలు అభ్యంతరం చెప్తున్నాయి.
మన దేశంలోనూ దీనిపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. న్యాయవ్యవస్థలోనూ దీనిపై చర్చ జరిగింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు లా కమిషన్ సిఫార్సులపై ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ఎలా స్పందిస్తాయో చూడాలి.