ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు నోటీసులు జారీ చేయాలన్న విషయంపై ప్రివిలేజ్ కమిటీ భేటీలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. తాము రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నామని గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేయాలన్న తమ హక్కులకు భంగం కలిగించినట్లుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి భావించారు. అందుకే వారు స్పీకర్ కార్యాలయంలో ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. వెంటనే స్పీకర్.. ప్రివిలేజ్ నోటీసుల్ని.. ప్రివిలేజ్ కమిటీకి పంపారు. వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలోని ప్రివిలేజ్ కమిటీ.. అలా తమకు నోటీసులు వచ్చిన తర్వాతి రోజే సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు మొదటగా వర్చువల్ భేటీ నిర్వహించారు.
అసెంబ్లీలోని రూల్ నెం 212, 213 కింద ఎస్ఈసీని పిలిపించవచ్చని కొంత మంది సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలానే చేశారని వారు వివరించారు. అయితే.. ఆర్టికల్ 243 ప్రకారం ఎస్ఈసీకి సర్వాధికారాలు ఉన్నాయని.. ఎలా పిలిపిస్తారని కమిటీలోని మరో సభ్యుడైన అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. అయితే ఎస్ఈసీకి సంబంధించిన అంశం కావడంతో ఆన్లైన్లో కాకుండా నేరుగా సమావేశం అయి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. మరో వారంలో నేరుగా సమావేశం కావాలని నిర్ణయించారు. ఎప్పుడనేది తేదీ ఖరారు చేసుకోలేదు. ఎస్ఈసీ అంశం కావడంతో విస్తృతంగా చర్చించాలని భావిస్తున్నారు.
అయితే నోటీసులు ఖాయమన్నట్లుగా అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసినా చివరికి ఇప్పుడు కాదు.. వేచి చూద్దామన్న ధోరణికి రావడం.. వైసీపీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. చివరి క్షణంలో వ్యూహం మార్చుకున్నారని భావిస్తున్నారు. గతంలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుపైనా చర్యలు తీసుకోవడం ఖాయమని మీడియాకు లీకులు ఇచ్చి ప్రివిలేజ్ కమిటీ సమావేశాల్ని నిర్వహించారు. కానీ తర్వాత వెనుకడుగు వేశారు. ఇప్పుడు ఎస్ీస ీవిషయంలోనూ.. కాస్త ఆలోచిస్తున్నారని చెబుతున్నారు.