హైదరాబాద్ లైఫ్ స్టైల్లో ఇప్పుడు కొత్త ఆకర్షణ ఆకాశ హర్మ్యాల అపార్టుమెంట్లు. ఎంత ఎత్తులో నివాసం ఉంటే అంత గొప్ప అన్నట్లుగా మారుతోంది. ప్రశాంతమైన వాతావరణం.. ఆకాశానికి దగ్గరగా ఉండటం.. మౌలిక సదుపాయాల కొరత రాకుండా చూసే ఏర్పాట్లు ఉండటంతో ఎత్తుకు ఎదిగిపోదామని అనుకుంటున్నారు. అందుకే.. అపార్టుమెంట్లు కొనుక్కోవాలని అనుకుంటే కనీసం పదిహేను అంతస్తుల నుంచి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు.
పదిహేను నుంచి అంతస్తులలోపు అపార్టుమెంట్లను గ్రౌండ్ ఫ్లోర్ గానే పరిగణిస్తున్నారు. అక్కడి నుంచి సిటీ వ్యూ పెద్దగా కనిపించదని.. పక్కన ఏదైనా మరో హై రైజ్ అపార్టుమెంట్ నిర్మిస్తే అసలు వ్యూ ఉండదని అనుకుంటున్నారు. ప్రశాంతమైన గాలి.. హాయిగా ఉండేందుకు ఎంత ఎత్తులో ఉంటే అంత మంచిదని అనుకుంటున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బిల్డర్లు కూడా పై అంతస్తులకు ఎక్కువ రేట్లు పెడుతున్నారు. ఇక్కడ వారికి ఎక్కువ గిట్టుబాటు అవుతోంది కానీ అసలు సమస్య దిగువ ఫ్లాట్లకే వస్తోంది. వాటికి అసలు డిమాండ్ ఉండటం లేదు.
ముఫ్పై నలభై అంతస్తులు నిర్మించే హై రైజ్ ఫ్లాట్లలో మొదటి పది అందస్తుల్లోని ఫ్లాట్లను అమ్ముకోవడం పెనుభారంగా మారుతోంది. అందుకే పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యవర్తుల ద్వారా బహిరంగంగా కాకుండా.. ఫ్లాట్ కొనాలని వచ్చే వారికి కింద అయితే తక్కువ ధరలకు వస్తాయని బేరాలు పెట్టిస్తున్నారు. అయినా వర్కవుట్ కావడం లేదు. ప్రస్తుతం నిర్మాణంలోఉన్న హై రైజ్ అపార్టుమెంట్లలో కూడా బుకింగ్స్ ఎక్కువగా పది నుంచి పదిహేను అంతస్తుల పైనే కానీ.. కింద స్థాయిలో తక్కువగా నమోదవుతున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.