సినిమాలు నా కోసమే తీసుకుంటా ఇష్టమైతే చూడండి లేకపోతే లేదు అంటాడు రామ్ గోపాల్ వర్మ. అందుకే ఆయన సినిమాలు ఇప్పుడు ఆయన తప్ప ఎవరూ చూడటం లేదు. సాక్షి పత్రిక కూడా అదే ఫార్ములాకు ఫిక్స్ అయిపోయింది. తన బినామీ ఓనర్ జగన్ రెడ్డికి ఏది నచ్చితే అవి మాత్రమే వేస్తున్నారు. ఆయనకు నచ్చని వ్యక్తుల ఫోటోలు, వార్తలు వేసేందుకు అసలు ఆసక్తి చూపించడం లేదు. అసలు పత్రిక ఉంది కొని చదివే వారి కోసమా ..లేకపోతే జగన్ మాత్రమే చూడటానికా అన్నది ప్రస్తుత పత్రిక చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. అసెంబ్లీకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఫోటో వేసి ఓ ఆర్టికల్ రాయాలి. ఎందుకంటే అందరూ కలిసి ఆయనను చైర్ వద్దకు తీసుకెళ్లారు. అసెంబ్లీకి ఏ మాత్రం గౌరవం ఇచ్చినా దీన్ని కవర్ చేయాల్సి ఉంది. కానీ చేయలేదు. పాఠకుల ఆసక్తిని బట్టి చూసినా ఇది సేలబుల్ వార్త.కానీ సాక్షి అసలు కవర్ చేయలేదు. అసెంబ్లీకి కనీస గౌరవం ఇవ్వలేదు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురించి కూడా అంతే. తప్పనిసరిగా..తమ వెర్షన్ వినిపించాలనుకున్నప్పుడు ఆయన పేరు రాయాల్సి వస్తే మాత్రమే రాస్తున్నారు. ఫోటోల సంగతి చెప్పాల్సిన పని లేదు.
సాక్షి పత్రికను ఇప్పటికే సామాన్య జనం మర్చిపోయారు. వైసీపీ కార్యకర్తలు మాత్రమే కొంటున్నారు. ఇటీవలి కాలంలో డబ్బులు దండగ అని వారు కూడా మానేస్తున్నారు. కనీసం అధికారం పోయిన తర్వాత అయినా … ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని అయినా ఇవ్వాలన్న ఆలోచన చేయడంలేదు. అసెంబ్లీ లాంటి వాటికి జగన్ దూరం అవుతారు.. అక్కడ జరిగే వాటిని ప్రజలకు తెలియకుండా చేయాలని సాక్షి అనుకుంటోంది. ఒక్క సాక్షి మాత్రమే చదివే పాఠకుడికి అన్యాయం చేస్తున్నట్లే కదా !