సాధారణంగా జాతీయ బడ్జెట్ లో రక్షణ రంగానికి చాలా బారీ కేటాయింపులు ఉంటాయి. ప్రతీ ఏటా అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప ఏనాడు తగ్గింది లేదు. ఈసారి బడ్జెట్ లో అసలు రక్షణ రంగానికి ఎంత కేటాయించారో ఆర్ధికమంత్రి తన బడ్జెట్ లో ప్రకటించలేదు. రక్షణ రంగానికి ప్రతీ ఏటా భారత్ కేటాయిస్తున్న బారీ బడ్జెట్ వలన పొరుగుదేశం పాకిస్తాన్ కూడా పోటీగా నిధులు సమకూర్చుకొని చాలా బారీగా ఆయుధాలు సమకూర్చుకొంటోంది. బహుశః అందుకే ఈసారి బడ్జెట్ లో రక్షణ రంగానికి కేటాయింపుల గురించి అధికారికంగా ప్రకటించలేదేమో. అయితే ఈసారి బడ్జెట్ లో రక్షణ రంగానికి గత ఏడాది కంటే రూ.24,463 కోట్లు అధికంగా అంటే రూ. 2, 49, 099 కోట్లు కేటాయించారు.
ఈసారి బడ్జెట్ లో గ్రామీణ అభివృద్ధి, రహదారులు మౌలిక వసతుల కల్పనకు చాలా బారీగా నిధులు కేటాయించారు. బడ్జెట్ అంటే ‘అంకెల గారడీ’ మాత్రమేననే ప్రజలలో ఉన్న అపోహను పోగేట్టేవిధంగా ఉంది. బడ్జెట్ లో ఎక్కడా ప్రజాకర్షక పధకాలకు, సబ్సీడీలకు చోటు కల్పించకుండా అన్ని రంగాలలో దేశం వేగంగా అభివృద్ధి చెందేందుకు వీలుగా రూపొందించారు. ఈ బడ్జెట్ యధాతధంగా అమలుచేయగలిగితే వచ్చే ఏడాదికి భారత్ లో కళ్ళకు కనబడేవిధంగా అభివృద్ధి జరగవచ్చును.