తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా అనే విమర్శలు ఉన్నాయి. లక్షణంగా ఉన్న సెక్రటేరియట్లను కూల్చేసి కేసీఆర్ కొత్తది కట్టారు. చరిత్రలో తన మార్క్ ఉండాలని ఆయన తాపత్రయపడ్డారు. ప్రధాని మోదీ కూడా అంతే. వారు కట్టిన వాటి గురించి అందరూ చెప్పుకుంటున్నారు. ప్రజలు కూడా..స్వాగతిస్తున్నారు . కానీ ఏపీలో మాత్రమే పరిస్థితి భిన్నం.
ఏపీలో ఏ ఒక్క నిర్మాణం కాదు కదా సిమెంట్ రోడ్ కూడా వేయడం లేదు. పోలవరం పూర్తయితే ప్రజలకు కరవనేది ఉండదు. అ ప్రాజెక్టుకు కావాల్సింది రూ. ముఫ్పై వేల కోట్లు. ప్రభుత్వం నాలుగు లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశామని చెబుతోంది. అందులో పది శాతం పెట్టి పోలవరం పూర్తి చేసి ఉంటే ఏపీ జనం కూడా… ఇలా సంబరాలు చేసుకునేవారు కాదా ? రాజధాని లేదు.. పెట్టిన రాజధానిని నాశనం చేశారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టాలనే వింత వాదన చేస్తున్నారు. కానీ అక్కడే పేదలకు పట్టాలిచ్చారు. ఇస్తే ఇచ్చారు.. మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసి ఉంటే పడిన పునాదులపై భవనాలు కట్టే పని ఆపకుండా ఉంటే ఏమయ్యేది..? ఆంధ్రులకు కూడా ఇలాంటి బెంచ్ మార్క్ నిర్మాణాలు ఉండేవిగా ?
ఏపీ ఓటర్లకు ఇవేమీ పట్టవని.. తమకేంటి అనుకుంటారని సోషల్ మడియాలో సెటైర్లు పడుతూ ఉంటాయి. అందులో నిజం ఉందో లేదో.. పాలకులు వారిని అలా మాయ చేస్తున్నారో కానీ.. మొత్తానికీ ఏపీ ప్రజలు.. తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన నిర్మాణాలు చేసిందని.. ఢిల్లీ సర్కార్.. చరిత్రసృష్టించిందని చప్పట్లు కొట్టుకోవడానికి సరిపోతుంది. ఏమీ లేని రాష్ట్రానికి ఏదో జరగాలని వారు కోరుకోవడం లేదు. తమ ఖాతాల్లో ఐదో పదో పడుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటున్నారు.