ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఎవరు హాజరైనా కాకపోయినా, అల్లుళ్లు వచ్చారా లేదా అనే విషయాన్ని మనవాళ్లు ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఈ సంగతి ఎందుకంటారా? అక్కడికే వస్తున్నాం. దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య వివాహ రిసెప్షన్ విశాగన్ తో గురువారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి సన్నిహితులు హాజరయ్యారు. రిసెప్షన్ జరిగింది కూడా రజనీకాంత్‌కి చెందిన రాఘవేంద్ర కల్యాణ మండపంలోనే. అందరూ సంతోషంగా ఫొటోలకు ఫోజులిస్తూ కనిపించారు. చిన్న కూతురు, చిన్నల్లుడు మాట సరే.. ఇంతకీ పెద్దల్లుడు ఏమయ్యాడు? ధనుష్ వచ్చాడా? రాలేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రిసెప్షన్ కు సంబంధించి బయటకు వచ్చిన ఫొటోల్లో ధనుష్ ఫొటో లేదు. పైగా ఫ్యామిలీ ఫొటోలోనూ పెద్ద కుమార్తె ఐశ్వర్య, ధనుష్ పెద్ద కుమారుడు లింగా, ఆఖరికి అనిరుద్ రవిచంద్రన్ మాత్రమే కనిపిస్తున్నారు. ధనుష్గానీ, చిన్న కుమారుడు కానీ ఫొటోల్లో లేరు. పెళ్లికి వచ్చి, ఫొటోల్లో లేరా.. లేక అసలే రాలేదా అనేది ఫొటోలు చూసిన వారికి అనుమానం.
ధనుష్ ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో `అసురన్`లో నటిస్తున్నారు. మలయాళ నటి మంజు వారియర్ ఇందులో ధనుష్ పక్కన నటిస్తున్నారు. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి థాను ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్‌కి కూడా మంచి స్పందనే వచ్చింది. హెయిర్ స్టైల్ నుంచి ఫొటోకు ఫోజ్ ఇవ్వడం వరకు అన్నిట్లోనూ ధనుష్ స్టైల్ కనిపిస్తోంది.