సినీ స్టార్లు, పారిశ్రామికవేత్తలు తెలంగాణకు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందుల్లో పడిన హైదరాబాద్‌ను.. అక్కడి ప్రజలను ఆదుకోవడానికి సీఎంఆర్ఎఫ్కు విరాళాలివ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇలా పిలుపునిచ్చారో లేదో అలా సినీ తారలు.. తమ భూరి విరాళాలను ప్రకటించండం ప్రారంభించారు. ఈ పరంపర అలా కొనసాే అవకాశం ఉంది. గతంలో కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా .. అదే విధంగా విరాళాలు వెల్లువెత్తాయి. తాజాగా సినీ స్టార్లతో పాటు మెఘా ఇంజినీరింగ్ సంస్థ ఓవర్ కృష్ణారెడ్డి తెలంగాణకు రూ. పది కోట్ల రూపాయల సాయం ప్రకటించారు.
తెలంగాణలో భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపడుతున్న కృష్ణారెడ్డి సాయాన్ని చూసి ఎవరూ ఆశ్చర్యపోలేదు కానీ.. తెలంగాణకు విరాళాలు ప్రకటిస్తున్న వారిలో ఒక్కరంటే.. ఒక్కరు కూడా ఏపీకి విరాళం ప్రకటించకపోవడమే చాలా మందిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. కోవిడ్ కారణంగా సేకరించిన సీఎంఆర్ఎఫ్ విరాళాలను.. రెండు రాష్ట్రాలకు పంచారు.. కార్పొరేట్ సంస్థల ఓనర్లు. ఇప్పుడు వరదల విషయంలో మాత్రం హైదరాబాద్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏపీలో కూడా పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే.. ఒక్కటే తేడా ఉంది.. అదే సీఎం కేసీఆర్ విరాళాలివ్వాలని అడగడం. సీఎం జగన్ అడగకపోవడం.
హైదరాబాద్ ప్రజల్ని ఆదుకోవడానికి విరాళాలివ్వాలని కేసీఆర్ బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి అలాంటి విజ్ఞప్తి ఏమీ చేయలేదు. అందుకే.. ఎవరూ ఏపీకి విరాళాలిచ్చే విషయాన్ని పరిశీలించలేదని అంటున్నారు. అడగకుండా అమ్మయినా అన్నం పెట్టదన్నట్లుగా.. సెలబ్రిటీలు అదే పనిగా విరాళాలివ్వాలంటే కష్టమే. అడగకుండా ఇచ్చే పరిస్థితి లేదు. కరోనా కారణంగా ఎవరి స్థాయిలో వారు నష్టపోయారు. అయినా కొంత మంది విమర్శించాలన్నట్లుగా… హైదరాబాద్‌కు ఇస్తున్నారు. ఏపీకి ఇవ్వడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.