ఏపీ ప్రభుత్వం అంటే ముందుగా ఎవరు గుర్తొస్తారు.. పేరుకు జగన్ గుర్తుకొస్తారు కానీ.. తెర ముందు కనిపించేది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే వైసీపీ అంటే ఎవరు గుర్తొస్తారు.. ఇక్కడా అంతే.. పేరుకు జగన్.. కానీ తెర ముందు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనే అన్నింటకీ తెర మీదకు వస్తూంటారు. తాజాగా పవన్, చంద్రబాబు భేటీ గురించి కూడా ఆయన మాట్లాడారు. అందులో అసలు ముందస్తు ఎన్నికల ఆలోచనే జగన్ చేయడం లేదని ప్రకటించారు. ప్రజలు మాకు ఐదేళ్లు పరిపాలించేందుకు అవకాశం ఇచ్చారని ఆయన చెబుతున్నారు.
ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ముందస్తుకు వెళ్లడానికి అనుమతి కావాలని అడిగినట్లుగా ప్రచారం జరిగింది. దీనపై అప్పట్లో వైసీపీ నేతలు ఎవరూ స్పందించలేదు. నిజానికి అలాంటి ప్రచారం ఎక్కువగా జరిగింది ప్రో వైసీపీ మీడియాలోనే. అయినప్పటికీ ఈ అంశంపై స్పందించలేదు. పవన్, చంద్రబాబు భేటీ అయ్యారని తెలియగానే సజ్జల రామకృష్ణారెడ్డి హఠాత్తుగా తెర ముందుకు వచ్చి.. ముందస్తు ఎన్నికలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రతిపక్షాలు ఇంకా సర్దుకోక ముందే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని.. కానీ జగన్ అంచనాలను తారుమారు చేసి.. విపక్షం వేగంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నందున ఇప్పుడు వెనక్కి తగ్గిదే బెటరని ఆలోచిస్తున్నారని చెబుతున్నారు.
పవన్ – చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పడం లేదని..రహస్య భేటీలని సజ్జల చెప్పుకొచ్చారు. కానీ అంతా బహిరంగ సమావేశాలే జరిగాయి. ఏం చర్చించుకున్నారో చెప్పారు. అయినప్పటికీ వాళ్లు ఓట్లు, సీట్లు గురించి చర్చించుకున్నారని చెప్పలేదని సజ్జల బాధపడిపోతున్నారు. మొత్తంగా ఆనం చెప్పినట్లుగా ముందస్తుకు వెళ్తే ముందే ఇంటికి వెళ్తామని స్పష్టమన క్లారిటీ వచ్చిందేమో కానీ.. సజ్జల మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చేస్తున్నారు.