రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని చాలామంది వేసిన అంచనాలు తలకిందులయ్యాయి.2015-16 కంటే 2016-17లో తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. దక్షిణాదిలోనే అగ్రస్థానంలో వుంది. ఈ మొత్తం 3,100 కోట్ల నుంచి 3,528 కోట్లకు పెరిగింది. రియల్ పెరుగుదల రేటు దాదాపు 14 శాతం వుంది. ఇదే సమయంలో ఎపిలో రిజిస్ట్రేషన్ల రాబడి దాదాపు 4 శాతం తగ్గింది. కర్ణాటకలో 5.61శాతం, తమిళనాడులో 18.36శాతం తగ్గింది. ఒక్క కేరళలో మాత్రం దాదాపు 5 శాతం పెరుగుదల నమోదైంది. అయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 83శాతం హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలోనే వుంది. పశ్చిమ హైదరాబాదులో గత ఏడాది 11,877 ఇళ్లనిర్మాణం జరుగుతున్నట్టు అంచనా. అమ్మకాలు కూడా పెరిగాయి. ఇందులో ఎక్కువ భాగం భారీ ప్రాజెక్టులే. కనీసంగా 600 ఇళ్లను ఒక ప్రాజెక్టుగా తీసుకుంటున్నారట. రియల్ రేట్ల పెరుగుదల కూడా బాగానే వుంది. ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణంలో మెలికలు గజిబిజి, కరువు వంటి కారణాలన్నీ రియల్బూమ్ను అడ్డుకుంటున్నాయి. రాజధాని చుట్టుపక్కల చాలాకాలంగా క్రయ విక్రయాలు నిలిపేశారు. తమదగ్గరున్న ప్లాట్లు పూర్తయ్యాకే ప్రభుత్వం మిగిలిన వారికి అనుమతివ్వాలని సింగపూర్ కన్సార్టియం షరతులు పెడుతున్నది. మొదట హైదరాబాదు నుంచి హడావుడిగా అమరావతిలో అవకాశాల కోసం పరుగుపెట్టిన వారు ఇప్పుడు ఉత్సాహం చూపడం లేదు. ఒక మోస్తరుగా నిర్మాణాలు చేసుకునేవారు బాగానే వున్నా ఆశించిన భారీ వూపు రాలేదన్నది నిజం. హైదరాబాదులో స్థిరపడిన తమ రాష్ట్ర కంపెనీలు విజయవాడ తరలివస్తాయని ప్రభుత్వం పెట్టుకున్న అంచనాలు కూడా నిజం కాలేదు. హైదరాబాదులో రియల్ రంగం జోరు పెరుగుతుందన్న వాతావరణం రావడంతో వెళ్లాలనుకున్నవారు కూడా ఆగిపోయారు. రాయలసీమకు నెల్లూరుకు చెందిన చాలా మంది బెంగుళూరులో రియల్ వ్యాపారంలో పాతుకుపోవడం తెలిసిన విషయమే. అలాగే హైదరాబాదు కూడా లాభసాటిగా వుంది. పైగా ఇక్కడ నగరవాసానికి సుఖజీవనానికి అలవాటు పడిన వారు విజయవాడ అమరావతి వంటి చోట్ల ఈ పరిస్థితి రావడానికి సమయం పడుతుందని అర్థం చేసుకున్నారు. ఆఖరుకు అనివార్యమై వెళ్లిన ఉద్యొగులు కూడా కుటుంబాలను హైదరాబాదులోనే వుంచి వారాంతంలో వచ్చి పోతున్నారు. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం కూడా ఈ కోవలోకి వస్తుంది.
మీడియాలోనూ సీనియర్లు చాలామంది ఇక్కడే కొనసాగుతున్నారు. సినిమా రంగం మారడానికి కూడా సమయం పట్టడంతో పాటు ఇంత భారీ స్టూడియోలు మళ్లీ కట్టనవసరం లేదన్న భావన వుంది. టీవీలు అక్కడ పెద్ద బ్రాంచీలు స్టూడియోలు పెట్టినా ప్రధాన కార్యలయాలు ఇప్పటికిప్పుడు మారకపోవచ్చు. ఎన్నికల నాటికి ఇది కొంచెం వూపందుకుని తర్వాతి మార్పులను బట్టి ముందు వెనక కావచ్చు. అయితే అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని సాధ్యమైనంత వేగంగా సమర్థంగా నిర్మించాలని అందరూ మనస్పూర్తిగా కోరుతున్నారు. కాని ప్రభుత్వం అతిశయోక్తితో కూడిన వ్యూహాల వల్లనే అలస్యం అస్పష్టత నెలకొన్నాయని అధికార పార్టీ వారే అంటున్నారు. రాజకీయంగా సామాజికంగా మాత్రం ఎవరి విషయాలు వారు చూసుకోవాలనే ధోరణి స్థిరపడింది. కాని సుహృద్భావం కూడా వుంది.