లాక్ డౌన్ కారణంగాహోమ్ లోన్, కారు లోన్, పర్సనల్ లోన్.. ఇలా అన్నిరకాల లోన్లపై ఈఎమ్ఐలు మూడు నెలల పాటు కట్టక్కర్లేదని ఆర్బీఐ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే.. అందులో ఉన్న డొల్ల ఏమిటో.. మెల్లగా ఒకటో తేదీ వచ్చే సరికి బయటపడింది. యాధృచ్చికంగా అది ఏప్రిల్ ఒకటి కావడం.. మరింత విశేషం. బ్యాంకులు ఈఎమ్ఐ వసూలును నిలిపివేయడం లేదు. రిక్వెస్ట్ పెట్టుకున్న వారివి మాత్రమే వసూలు నిలిపివేస్తాయి. అలా రిక్వెస్ట్ పెట్టుకుంటే… ” టర్మ్స్ అండ్ కండిషన్స్”ని అంగీకరించినట్లే. ఈ ” టర్మ్స్ అండ్ కండిషన్స్”లో ముఖ్యమైనదే. వాయిదా వేసిన మొత్తానికి వడ్డీ కట్టేందుకు .. అంగీకరించడం. అంటే.. ఈ మూడు ఈఎమ్ఐల మీద వడ్డీ చెల్లించడానికి సిద్ధపడటం.
మూడు నెలలు ఈఎమ్ఐ కట్టలేమని.. బ్యాంకుకు అప్లయ్ చేసుకుంటే… వడ్డీ బారీగా పడుతుంది. ఉదాహరణకు.. 9.5 శాతం వడ్డీకి 20 లక్షల గృహరుణం ఉందనుకుందాం. దానిపై మూడు నెలలు ఈఎమ్ఐ మారటోరియానికి ధరఖాస్తు చేసుకుంటే… మూడు నెలలకు దాదాపుగా రూ. అరవై వేలు ఈఎమ్ఐ కట్టాల్సిన పని ఉండదు. కానీ ఈ మొత్తం రుణానికి యాడ్ అవుతుంది. ఈఎమ్లో అసలు, వడ్డీ కలిపి.. రుణానికి కలిపేసి.. మళ్లీ దాని మీద.. వడ్డీ వేస్తారు. అంటే.. కట్టాల్సిన నెలల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. మూడు నెలల ఈఎమ్ఐ వాయిదా వేసుకున్నందున.. అది … ఆరు నెలల నుంచి పది నెలల వరకూ కట్టాల్సిన గడువు పెరుగుతుంది. ఒక వేళ ఈ నెలలు పెరగకుండా ఉండాలంటే.. మూడు నెలల తర్వాత ఈఎమ్ఐ పెంచుకోవాలి. ఎలా చూసినా.. మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే… రుణ గ్రహీతలకు భారమే కానీ.. లాభం నయాపైసా ఉండదు.
ఆర్బీఐ మారటోరియాన్ని ఊరటగా ప్రకటించినప్పటికీ వాస్తవంలో మాత్రం.. బాదుడే. మారటోరియాన్ని అన్ని విధాలుగా ఆలోచించి ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మారటోరియం ఎంచుకుంటే భారమే కాబట్టి రుణగ్రహీతలు తప్పనిసరి అనుకుంటేనే ఆర్బీఐ ఇచ్చిన ఆప్షన్ ఎంచుకోవాలి. నెలవారీ ఆదాయాలు రాని పక్షంలో, వేతనాలు నిలిచిపోతే, అత్యంత కష్టంగా ఉంటే మాత్రమే మారటోరియం ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.