చావు బతుకుల మధ్య ప్రాణం నిలుపుకునేందుకు అంబులెన్సుల్లో హైదరాబాద్ వస్తున్న రోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. రోగులతో కూడిన అంబులెన్స్‌లను తెలంగాణలోకి రానివ్వొద్దంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో.. సరిహద్దుల్లో పోలీసులు ఎక్కడివక్కడ ఆపేస్తున్నారు. దాంతో రోగుల బంధువులు పోలీసుల కాళ్లా వేళ్లా పడుతున్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు చూసి.. మనసున్న ఏ ప్రజాప్రతినిధి అయినా.. ప్రభుత్వం అయినా తక్షణం స్పందించాలి. కానీ.. ఏపీ సర్కార్ మాత్రం.. సైలెంట్‌గా ఉండిపోయింది.
కానీ గుంటూరు రూరల్ ఎస్పీ మాత్రం.. మరింత అమానవీయంగా స్పందించారు. హైదరాబాద్ ఆస్పత్రిలో బెడ్ రిజర్వ్ చేసుకుని వెళ్లండి లేదా.. తెలంగాణ సర్కార్ నుంచి అనుమతి పొంది వెళ్లాలని సలహా ఇచ్చారు.. అంతే కానీ ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకుని.. తాము తెలంగాణ సర్కార్‌తో మాట్లాడతామని చెప్పలేదు. అసలు ఈ సమస్య గురించి తెలియనట్లే ప్రభుత్వం వ్యవహరించింది. అయితే ఇతర పార్టీల నేతలు మాత్రం.. ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని.. తక్షణం అక్కడి ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం మాట్లాడాలని డిమాండ్ చేశారు.
నిజానికి ప్రజాప్రతినిధులు కాకపోయినా.. ఇందులో రాజకీయం చూడకుండా.. మానవత్వం చూస్తే.. అంబులెన్స్‌లు ఆపే ప్రయత్నం చేయరని అంటున్నారు. తెలంగాణ ఆస్పత్రుల్లో బెడ్ రిజర్వ్ చేసుకున్నా.. పంపడం లేదని కొంత మంది ఆరోపిస్తున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం నిరంకుశత్వం.. ఇటు ఏపీ సర్కార్.. బాధ్యతా రాహిత్యం కలిసి. కోవిడ్ రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కనీసం మానవత్వంతో వ్యవహిరంచలేకపోతున్నారు.