సంధ్య థియేటర్ ఘటన, అరెస్టు, బెయిలు.. ఇలాంటి ఇబ్బందికరమైన పరిణామల తరవాత అల్లు అర్జున్ తొలిసారి ఓ సినిమా వేడుకలో పాలు పంచుకొంటున్నాడు. అదే ‘తండేల్’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించింది. ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత తనకు కూడా ఉంది కాబట్టి, ఈ ఫంక్షన్‌కి బన్నీ హాజరవుతున్నాడు. బన్నీ వస్తున్నాడు కాబట్టి స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. ఫ్యాన్స్ ప్రవాహం వదన్నా కనిపిస్తుంది. అందుకే చిత్రబృందం ముందు జాగ్రత్తలు తీసుకొంటోంది. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని అభిమానులు లేకుండానే, కేవలం టీమ్ సమక్షంలో జరపాలని నిర్ణయించుకొంది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది.
రేపు సాయింత్రం 6 గంటల నుంచి అన్నపూర్ణ సెవన్ ఏకర్స్‌లో ఈ ఈవెంట్ జరగబోతోంది. మీడియా రావొచ్చు. కానీ కెమెరాలకు అనుమతి లేదు. ఫ్యాన్స్ కి అయితే నో ఎంట్రీ. అంటే ఈ ఈవెంట్ ఎంత సింపుల్ గా తేల్చేస్తున్నారో అర్థం చేసుకోవొచ్చు. ఇటీవల స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కాస్త తలనొప్పి వ్యవహారాలుగా తయారవుతున్నాయి. ఎవరు చిన్న తప్పు చేసినా, జరగరానిది ఏదైనా జరిగినా చిత్రబృందం తల వంచుకోవాల్సివస్తోంది. అందుకే.. ఆ ఇబ్బందుల్ని పరిహరించడానికి ఈ ఏర్పాట్లు చేశారు. నిజానికి శనివారమే ఈ ఈవెంట్ చేయాల్సింది. కానీ ఆదివారానికి వాయిదా పడింది.